టాలీవుడ్ సీనియర్ నటుడు మురళీ మోహన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. రీసెంట్ గా ఆయన మనవరాలు రాగ మాగంటి, ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి కొడుకు శ్రీ సింహా కోడూరిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. దుబాయ్ లో జరిగిన ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యింది. అయితే ఈ పెళ్లికి తాను ఎందుకు వెంటనే ఒప్పుకున్నారో మురళీ మోహన్ బయటపెట్టారు.
పిల్లలిద్దరూ వచ్చి తమ ప్రేమ విషయం చెప్పగానే, రెండో ఆలోచన లేకుండా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. దీనికి ప్రధాన కారణం రాజమౌళి, కీరవాణి కుటుంబంపై ఉన్న నమ్మకమే అని చెప్పారు. ఇండస్ట్రీలో ఆ ఫ్యామిలీకి చాలా మంచి పేరు ఉంది. వాళ్లు ఎప్పుడూ కలిసే ఉంటారు. వెకేషన్ కు వెళ్లినా, ఇంట్లో పేకాట ఆడుకున్నా అందరూ ఒకే చోట సందడి చేస్తారు.
ఆ కుటుంబంలో ఉన్న బంధాలు, అనురాగాలు చాలా గొప్పవని మురళీ మోహన్ చెప్పుకొచ్చారు. వాళ్లు ఒకరికొకరు తోడుగా నిలబడే విధానం తనకు బాగా నచ్చిందన్నారు. అంత మంచి ఫ్యామిలీలో తన మనవరాలు అడుగుపెడుతుందంటే అంతకంటే ఇంకేం కావాలని అనిపించిందట. అందుకే ప్రపోజల్ రాగానే ఏమాత్రం ఆలోచించకుండా ఓకే చెప్పేశానని స్పష్టం చేశారు.
రెండు పెద్ద కుటుంబాలు ఈ పెళ్లితో ఒక్కటయ్యాయి. దుబాయ్ వేడుకలో రాజమౌళి దంపతుల డాన్స్ హైలైట్ గా నిలిచిన విషయం తెలిసిందే. మురళీ మోహన్ మాటలను బట్టి చూస్తే, ఆ ఫ్యామిలీ బాండింగ్ బయట జనాలకే కాదు, ఇండస్ట్రీ పెద్దలకు కూడా ఎంత నమ్మకాన్ని ఇస్తుందో అర్థం చేసుకోవచ్చు.
