2023 సంక్రాంతికి టాలీవుడ్ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ బాక్సాఫీస్ వార్ జరుగబోతోంది.. ఇన్నాళ్లు కోవిడ్ కారణంగా నష్టాలు ఎదుర్కొన్న సినీ పరిశ్రమలో.. పాండమిక్ తర్వాత రిలీజ్ క్లాషెస్ చాలానే వచ్చాయి.. తెలుగు చిత్ర పరిశ్రమకి సంక్రాంతి అనేది చాలా పెద్ద సీజన్.. భోగి, సంక్రాంతి, కనుమ..ఇలా మూడు రోజులూ.. లేదా, ఒకటి, రెండు రోజుల ముందుగానో సినిమాలు రిలీజ్ చేసేవారు.. పండుగ సీజన్ కాబట్టి మూడు, నాలుగు సినిమాలు వదిలినా ప్రేక్షకాభిమానులు థియేటర్లకు పోటెత్తేవారు..
ఆ సందడితో హాళ్లన్నీ జాతరను తలపించేవి.. అయితే ఇప్పుడు పరిస్థితి వేరేలా ఉంది.. విడుదల చెయ్యడానికి సినిమాలైతే ఉన్నాయి కానీ.. వాటిని ప్రదర్శించడానికి థియేటర్లే దొరకని పరిస్థితి నెలకొంది.. ఇండస్ట్రీలో ఓ నలుగురైదుగురు నిర్మాతలదే హవా.. ఆ నాలుగు ఫ్యామిలీలదే పెత్తనం.. వారికి ఎదురెళ్తే తొక్కేస్తారు.. లాంటి కామెంట్స్ గతంలో చాలానే విన్నాం.. కానీ ఈసారి పోటీ పెద్ద హీరోల మధ్యనే కాదు.. నిర్మాతల మధ్య కూడా ఉంది.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ మూవీ ’ఆదిపురుష్‘ సంక్రాంతికి వస్తుందని ముందే అనౌన్స్ చేశారు.
తర్వాత మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, ఆ తర్వాత దళపతి విజయ్ టాలీవుడ్ ఎంట్రీ ‘వారసుడు’ సినిమాలు కూడా సంక్రాంతికే కర్చీఫ్ వేసుకున్నాయి. కట్ చేస్తే, రీసెంట్ గా నటసింహ బాలయ్య కూడా ‘వీర సింహా రెడ్డి’ గా సంక్రాంతి బరిలోకే దిగుతున్నాను అనడంతో అంతా షాకయ్యారు. చిరు, బాలయ్య సినిమాలకు మైత్రీ వాళ్లే నిర్మాతలు.. లేటెస్ట్ గా ఫిలిం సర్కిల్స్ లో ఈ నిర్మాతలు, టాప్ ప్రొడ్యూసర్ కమ్ డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజుకి మధ్య ఓ వివాదం నెలకొందనే వార్తలు ఊపందుకున్నాయి..
‘వాల్తేరు వీరయ్య’, ‘వీర సింహా రెడ్డి’ రెండు సినిమాలకు సంబంధించి నైజాంతో పాటు వైజాగ్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ దిల్ రాజుకి ఇవ్వలేదట.. సాధారణంగా పెద్ద సినిమాలు పంపిణీ చేసినా, తన సొంత మూవీస్ రిలీజ్ అయినా కానీ దాదాపు థియేటర్లన్నీ వాటికే కేటాయిస్తుంటాడు దిల్ రాజు.. ఆయన చేతిలో లీజుకు తీసుకున్న థియేటర్స్ చాలానే ఉన్నాయి. ఇక నైజాం విషయానికొస్తే.. ఇక్కడ రాజు కంటే కూడా ఏషియన్ వాళ్లకే ఎక్కువ స్క్రీన్స్ ఉన్నాయి..
తనకు రెండు సినిమాల రైట్స్ ఇవ్వలేదు.. పైగా ఓన్ మూవీ ‘వారసుడు’ కూడా ఉంది కాబట్టి నైజాం, వైజాగ్ ఏరియాల్లో రాజు.. చిరు, బాలయ్య సినిమాలకు థియేటర్లు ఇస్తాడా? లేక, వారసుడు’ తో తన థియేటర్లను నింపేస్తాడా? అనే హాట్ టాపిక్ నడుస్తోంది. మైత్రీ వాళ్లు సీడెడ్ డిస్ట్రిబ్యూటర్ శశి మేనేజ్ మెంట్ సంస్థతో కలిసి సొంతంగా డిస్ట్రిబ్యూషన్ సంస్థ స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నారని.. దీనిలో మరో పెద్ద సంస్థ కూడా భాగస్వామ్యమవుతుందనే వార్తలు ఫిలిం నగర్ లో జోరుగా వినిపిస్తున్నాయి..