దివంగత స్టార్ డైరెక్టర్ ఇ వి వి సత్యనారాయణ గారి చిన్నబ్బాయిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అల్లరి నరేష్… కామెడీ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇలా చిన్న సినిమా నిర్మాతలకు కల్పవృక్షంగా మారిపోయాడు. అతని సక్సెస్ రేటు ఎక్కువగా ఉండటం వల్లనే అది సాధ్యమయ్యింది అని చెప్పాలి. అలా అని కేవలం కామెడీ సినిమాల పైనే అతను ఆధారపడిపోలేదు. విశాఖ ఎక్స్ ప్రెస్, గమ్యం, నేను వంటి సినిమాలతో మంచి నటుడిగా కూడా గుర్తింపు పొందాడు.
జబర్దస్త్ కామిడీ షోల వల్ల కామిడీ సినిమాలకు జనాలు థియేటర్ కి రావడం తగ్గించిన టైమ్లో అల్లరి నరేష్.. రూట్ మార్చి మహర్షి, నాంది వంటి సినిమాల్లో సీరియస్ రోల్స్ చేసి సక్సెస్ అయ్యాడు. అలా అని ఉగ్రం అనే సినిమాలో పవర్ఫుల్ రోల్ చేయగా అది వర్కవుట్ కాలేదు. మహర్షి లో చేసిన రవి పాత్ర నరేష్ కి బాగా హెల్ప్ అయ్యింది ఇక ఇప్పుడు ఒక పక్క హీరోగా సినిమాలు చేస్తూనే వేరే హీరోల సినిమాల్లో కూడా కీలక పాత్రలు చేయడానికి అల్లరి నరేష్ ఇంట్రస్ట్ చూపిస్తున్నాడు.
ఈ క్రమంలో నాగార్జున హీరోగా విజయ్ బిన్నీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ నా సామి రంగ ‘ సినిమాలో ఓ కీలక పాత్ర చేస్తున్నాడు. ఈ సినిమాలో అంజి అనే పాత్రలో కనిపించనున్నాడు నరేష్. నాగార్జునకి స్నేహితుడుగా ఈ సినిమాలో నరేష్ కనిపిస్తాడు. సెకండ్ హాఫ్ లో నరేష్ పాత్ర చాలా ఎమోషనల్ గా కంటతడి పెట్టించే విధంగా ఉంటుందట. మరోసారి గమ్యంలో గాలి శీనుని గుర్తుచేసే విధంగా నరేష్ పాత్ర ఉంటుంది అని సమాచారం.
మరి ఈ సినిమా నరేష్ సెకండ్ ఇన్నింగ్స్ కి ఎంతవరకు బూస్టప్ ఇస్తుంది అనేది తెలియాల్సి ఉంది. ఇక శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఉండగా.. పవన్ కుమార్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతానికైతే 2024 సంక్రాంతి టార్గెట్ గా నా సామి రంగ రూపొందుతుంది