రీమేక్ సినిమాలో నటించడం హీరోకు ఎంత కష్టమో, హీరోయిన్‌కీ అంతే కష్టం. తాజాగా అలాంటి ఫీట్ చేస్తున్న నాయికల్లో నభా నటేశ్ ఒకరు. ‘అందాధున్’సినిమాను తెలుగులో ‘మాస్ట్రో’గా రీమేక్ చేశారు. ఈ సినిమా ఓటీటీలో ఈ నెల 17న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో థియేటర్లు – ఓటీటీ అనే కాన్సెప్ట్ మీద నభా మాట్లాడింది. గతంలో ఓటీటీ అంటే భయం ఉండేదని చెప్పిన నభా… ఇప్పుడు తగ్గింది అని చెప్పింది. ఎందుకిలా చెప్పిందో ఆమె మాటల్లోనే…
కరోనా సమయంలో చాలా సినిమాలు ఓటీటీలవైపు వచ్చినా… నభా నటించిన రెండు సినిమాలు మాత్రం థియేటర్లలోనే విడుదలయ్యాయి. అందులో ‘సోలో బతుకే సో బెటరు’ ఆకట్టుకోగా, ‘అల్లుడు అదుర్స్’ ఉసూరుమనిపించింది. ఇప్పుడు మూడోది ‘మాస్ట్రో’ ఓటీటీలో వస్తోంది. ఓటీటీ అంటే భయం ఉన్నా… ఈసారి ఓటీటీలోకి రావడం తప్పలేదు అని నభా చెబుతోంది. ప్రతి సినిమా ఒకదానితో మరొకటి సంబంధం లేకుండా ఉండేలా చూసుకుంటా అని చెప్పిన నభా… అన్ని రకాల జానర్లు, పాత్రలు చేయాలనుందని తెలిపింది.
మరి ‘అందాధున్’ చూశారా అని అడిగితే… ‘అందాధున్’ బాలీవుడ్‌లో బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. అలాంటి సినిమా రీమేక్‌లో అవకాశం రావడం నా అదృష్టం. మొదట్లో కాస్త భయంగానూ అనిపించిందట నభాకి. మాతృకలో రాధికా ఆప్టే అద్భుతంగా నటించింది కదా… నేను చేయగలనా అని నభా అనుకుందట. సినిమా ప్రారంభించడానికి ముందు ‘అందాధున్’ చూసినా.. తర్వాత మళ్లీ చూడకూడదనుకుందట. ఆమె నటన మీద ప్రభావం పడకూడదనేదే ఆమె ఆలోచనట.