అన్నదమ్ముల మధ్య అనుబంధాలు, అనురాగాలు మాత్రమే కాదు.. అప్పులు కూడా ఉంటాయి. అయితే బయటికి చెప్పుకోరు. సెలబ్రిటీలు కాబట్టి మెగా బ్రదర్స్ మధ్య ఉన్న అప్పుల విషయం బయటపడింది. అదికూడా తమ కుటుంబంపై మీడియాలో వస్తున్న విమర్శల కారణంగా నాగేంద్రబాబు వెల్లడించాల్సి వచ్చింది. ఎనిమిదేళ్ల క్రితం రామ్ చరణ్ తేజ్ తో నాగేంద్రబాబు ఆరెంజ్ సినిమా తీశారు. అప్పుడే మగధీర హిట్ కొట్టడంతో చరణ్ సినిమాకోసం 30 కోట్లు ఖర్చు పెట్టారు. తన వద్ద ఉన్న డబ్బుతో పాటు, అప్పు తెచ్చి మరీ నిర్మించారు. అయితే ఆ చిత్రం భారీ నష్టాన్ని మిగిల్చింది. సినిమా అపజయంతో నిరాశలో ఉన్న నాగేంద్ర బాబుకి అప్పుల వాళ్ల ఇబ్బందులు ఎక్కువయ్యేసరికి ఒత్తిడి తట్టుకోలేకపోయారు.
ఒకానొకక్షణంలో ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనుకున్నారు. ఆ పరిస్థితిలో పవన్ కళ్యాణ్ అన్నకి అండగా నిలిచారు. నాగేంద్రబాబు అప్పులను తీర్చేసారు. దీంతో నాగేంద్రబాబు కోలుకొని సినీ నిర్మాణం పక్కన పెట్టి టీవీ షోకి జడ్జ్ గా వ్యవహరించారు. వచ్చిన డబ్బుతో ఇల్లు నడిపించారు. కానీ పవన్ కళ్యాణ్ అప్పు మాత్రం తీర్చలేకపోయారు. అయితే మా ఛానెల్ ని స్టార్ వాళ్ళు కొనుక్కున్నప్పుడు.. అందులో ఉన్న నాగేంద్ర బాబు షేర్స్ కి బాగానే ధర వచ్చింది. అప్పుడు పవన్ కి ఉన్న అప్పులో కొంత తీర్చారు. ఇక తాజాగా కొడుకు వరుణ్ తేజ్ విజయాలతో దూకుపోతుండడం నాగేంద్రబాబుకి బలాన్ని ఇచ్చింది. అతనికి వచ్చిన రెమ్యునరేషన్ తో పవన్ కి ఇవ్వాల్సిన అప్పు మొత్తం తీర్చినట్టు ఫిలిం నగర్ వాసులు చెప్పుకుంటున్నారు.