‘వార్ 2’ సినిమా తెలుగు రాష్ట్రాల రిలీజ్ హక్కులు కొన్న తర్వాత నిర్మాత నాగవంశీ చేసిన హడావుడి మీకు గుర్తుండే ఉంటుంది. ‘దేవర’ సినిమాకు రూ.600 కోట్ల పోస్టర్ వేసి హైప్ పెంచే ప్రయత్నం చేసి.. తర్వాత ఆ పోస్టర్లు ఫేక్ అని చెప్పి గాలి తీసేసిన ఆయన.. ‘వార్ 2’ విషయంలో చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెంచేశారు. సినిమాలో ఆ సీన్ ఇలాగా, ఈ సీన్ అలాగా, హీరో ఎన్టీఆర్ ఫుల్ లెంగ్త్ రోలో ఉంటారు అంటూ క్లారిటీలు.. అబ్బో చాలానే చెప్పారు. ఇక ప్రీరిలీజ్ ఈవెంట్‌లో హడావుడి, రికార్డుల మాటల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటి ఆయనకు ఇప్పుడు పూర్తిగా జ్ఞానోదయమైంది.
తన కొత్త సినిమా ‘మాస్ జాతర’ రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్న నాగవంశీ ఇటీవల ‘వార్ 2’ సినిమా ఫలితం గురించి మాట్లాడాడు. ఇంకా చెప్పాలంటే మాట్లాడించాడు రవితేజ. ‘వార్ 2’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నాగవంశీ స్పీచ్‌పై రవితేజ సెటైర్ వేశాడు. అది అభిమానులకు విజ్ఞప్తి చేసినట్టుగా లేదని, థియేటర్లలో సినిమా చూడటానికి రాకపోతే మీ పని చెబుతా అని వార్నింగ్ ఇచ్చినట్లుగా ఉందని రవితేజ తనదైన శైలిలో సెటైర్ వేశాడు.
దానిపై నాగవంశీ రియాక్ట్ అవుతూ ‘‘ఆరోజు నేను బాగా ఎక్సయిట్ అయ్యాను. మనుషులు తప్పులు చేస్తారు. నేను కూడా తప్పు చేశాను, తప్పు జరిగింది. ఆదిత్యా చోప్రా, యశ్ రాజ్ ఫిల్మ్స్ సంస్థను నేను, ఎన్టీఆర్ నమ్మాం. వాళ్ల వైపు నుండే తప్పు జరిగింది. మనం దొరికిపోయాం. సినిమా మిస్‌ఫైర్ అయ్యిందని, దీంతో సోషల్ మీడియాలో నన్ను ట్రోల్ చేశారు. అయితే తాము ‘వార్ 2’ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేశామని.. నేరుగా తీసి ఉంటే ఇంకోలా రెస్పాన్స్ ఉండేది’’ అని తన ప్రొడక్షన్ మీద నమ్మకంతో మాట్లాడారు నాగవంశీ.
అయితే నాగవంశీ స్ట్రయిట్ సినిమాలు కూడా ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదనే విషయం మనం గమనించాలి. అయితే బాలీవుడ్ స్టార్ హీరోను పెట్టుకుని.. సౌత్ హీరో తీసుకొని ఓ బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఇద్దరు హీరోలకు సమంగా ప్రాధాన్యం ఇస్తుందని ఎలా నమ్మేశారో నాగవంశీ, ఎన్టీఆర్ అనేది వారికే తెలియాలి. ఇప్పుడు నాగవంశీ మాటలు వింటుంటే సినిమా చూడకుండానే నాగవంశీ రైట్స్ కొన్నట్లు అర్థమవుతోంది. మరి తారక్ అయినా రిలీజ్‌కి ముందు చూశాడో లేదో?