ఒకే పేరుతో ఒకే కాలంలో రెండు సినిమాలు రూపొందడం మనం గతంలో చూశాం. సినిమా మొదట్లో సమస్యగా కనిపించే ఇది, సినిమాలు విడుదల దగ్గరకికి వచ్చేసరికి పెద్ద సమస్యగా మారిపోతుంది. నానా ఇబ్బందులు పడి ఎవరో ఒకరు టైటిల్ మార్చుకుంటారు. లేదంటే టైటిల్‌కి ముందో, వెనుకో ఏదో పదం యాడ్ చేస్తుంటారు. అలా ఇటీవల కాలంలో కొన్ని సినిమాలు వచ్చాయి. ఇప్పుడు మరోసారి అలాంటి పరిస్థితే వచ్చింది. ఈ సారి ఆ కీలక పేరు ‘నాగేశ్వరరావు’. అవును ఆ పేరుతోనే సమస్య.
అక్కినేని నాగచైతన్యతో ఓ సినిమా ఉంటుందని ఇటీవల పరశురామ్ చెప్పిన విషయం తెలిసిందే. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై ఈ సినిమాను తెరకెక్కిస్తారని సమాచారం. అయితే ఇక్కడే ఓ సమస్య వచ్చి పడింది. అదే టైటిల్. ఈ సినిమా కోసం ‘నాగేశ్వరరావు’ అనే పేరు అనుకుంటున్నామని చెబుతున్నారు. అయితే ఇప్పటికే ఇలాంటి టైటిల్ ఇద్దరు వాడుతున్నారు. స్టువర్ట్‌పురం రాబిన్ హుడ్‌గా పిలుచుకునే నాగేశ్వరరావు కథను రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’గా తీసుకొస్తున్నారు. మరోవైపు ‘గాలి నాగేశ్వరరావు’గా మంచు విష్ణు ఓ సినిమా చేస్తున్నారు.
ఆ సినిమా షూటింగ్ చివరి దశకొచ్చింది అని సమాచారం. ఇప్పుడు నాగచైతన్య సినిమాకు ‘నాగేశ్వరరావు’ అనే పేరు పెడతాం అంటున్నారు. గతంలో ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు పేరుకు ముందు, వెనుక ఏదో పేరు యాడ్ చేయక తప్పని పరిస్థితి వచ్చిందంటున్నారు. మరి దీనిపై పరశురామ్ టీమ్ ఏం చేస్తుందో చూడాలి. ‘టైగర్ నాగేశ్వరరావు’ విషయానికొస్తే టైగర్ అనే పేరు ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. కానీ ‘గాలి నాగేశ్వరరావు’ విషయానికొస్తే నాగేశ్వరరావు అనేది ప్రముఖంగా వినిపిస్తోంది.
మరిప్పుడు నాగచైతన్యకు తన తాత పేరు పెట్టుకునే అవకాశం ఉంటుందా? గతంలో ఎప్పుడో ఇలా పేర్లకు ముందు, తర్వాత వేరే పేర్లు యాడ్ చేయడం లాంటివి వద్దు అని టాలీవుడ్‌లో అనుకున్నారని సమాచారం. దీంతో తాత పేరు మనవడుకు వస్తుందా అనేది చూడాలి. అయితే ఇప్పటికే ఈ టైటిల్ రిజిస్టర్ చేయించారు అనే మాట కూడా వినిపిస్తోంది.