గతేడాది డిసెంబర్ 25వ తేదీన శ్యామ్ సింగరాయ్ సినిమా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా రిలీజ్ సమయంలో నాని చేసిన కామెంట్లు శ్యామ్ సింగరాయ్ కలెక్షన్లపై ప్రభావం చూపాయి. శ్యామ్ సింగరాయ్ రిలీజ్ సమయంలో థియేటర్లలో తనిఖీలు జరగడంతో పాటు తక్కువ టికెట్ రేట్లు మాత్రమే అమలయ్యేలా అధికారులు చర్యలు చేపట్టారు. కొన్ని ఏరియాల్లో శ్యామ్ సింగరాయ్ సినిమాకు థియేటర్ల విషయంలో కూడా ఇబ్బందులు ఎదురయ్యాయని వార్తలు వచ్చాయి.
ఫలితంగా హిట్ టాక్ తెచ్చుకున్న శ్యామ్ సింగరాయ్ సినిమాకు ఏపీలో నష్టాలు వచ్చాయి. నాని తన రెమ్యునరేషన్ లో కొంత మొత్తాన్ని నిర్మాతకు తిరిగిచ్చేశారని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. శ్యామ్ సింగరాయ్ రిలీజైన సమయంలోనే ఏపీలోని పలు థియేటర్లను అధికారులు సీజ్ చేశారు. ఎక్కువ టికెట్ రేట్లకు టికెట్లను విక్రయించిన థియేటర్లను కూడా అధికారులు సీజ్ చేయడం జరిగింది.
అయితే బంగార్రాజు సినిమాకు మాత్రం టికెట్ రేట్ల విషయంలో ఏపీ ప్రభుత్వం చూసీచూడనట్లుగా వ్యవహరించిందని కామెంట్లు వినిపిస్తున్నాయి. సీడెడ్ లో బంగార్రాజు సినిమా టికెట్ రేటు 200 రూపాయలుగా ఉండగా ఆంధ్రలో యూనిఫారమ్ రేటు 100 రూపాయలుగా ఉందని ఫలితంగా ఏపీలో బంగార్రాజు మంచి కలెక్షన్లను నమోదు చేయడం సాధ్యమైందని తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వం ఒక్కో సినిమా విషయంలో ఒక్కో విధంగా వ్యవహరిస్తోందని విమర్శలు వస్తున్నాయి.
మరోవైపు పుష్ప మూవీ మేకర్స్ కాకినాడలో ఈవెంట్ పెట్టాలని అనుమతి కోరగా తక్కువ కేసులు నమోదవుతున్నా అప్పట్లో ఏపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. నిన్న మాత్రం రాజమండ్రిలో బంగార్రాజు ఈవెంట్ కు అనుమతులు లభించాయి. ఎక్కువ కేసులు నమోదవుతున్న సమయంలోనే ఈ ఈవెంట్ జరగడం గమనార్హం. ఏపీ ప్రభుత్వం అందరు హీరోల విషయంలో ఒకే విధంగా వ్యవహరించాలని నాని ఫ్యాన్స్ కోరుతున్నారు. నాని భవిష్యత్ సినిమాల విషయంలో ఏపీ ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుందో చూడాల్సి ఉంది. నాని నటిస్తున్న రెండు సినిమాలు ఈ ఏడాది రిలీజ్ కానున్నాయి.