ఓ సినిమా విడుదలవుతుందంటే సహజంగా ఉండే ఆసక్తికి మించి ‘నాని’ సినిమా విడులవుతుంది అన్న స్థాయిలో ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నాడు గంట నవీన్ బాబు అలియాస్ నాని. ముందు వెనుక సినిమాలతో సంబంధం లేని కథలను ఎంపిక చేసుకుంటూ తనదైన ప్రత్యేకతను చాటుతున్నాడు. ఇప్పటికే ఈ ఏడాది రెండు హిట్స్ కొట్టిన నాని ఈ నెల 23న ‘మజ్ను’గా తెరమీదికి రానున్నాడు. ఈ సందర్భంగా నాని సినిమా గురించి, తన కథల గురించి ఈ విధంగా చెప్పుకొచ్చాడు.కొన్ని కథలు వినగానే విజయం సాధిస్తున్న నమ్మకం వచ్చేస్తుంది. విరించి వర్మ మజ్ను కథ చెప్పగానే అలానే అనిపించింది.
ఈ సినిమాలో ‘బాహుబలి’ సినిమాకి రాజమౌళి సహాయ దర్శకుడిగా నటించా. ఇందులో రాజమౌళి మాత్రమే కనపడతారా ఇంకెవరైనా ఉన్నారా అన్నది తెరమీదే చూడాలని చెప్పారు నాని. ఇక తన కథ గురించి ముచ్చటిస్తూ నాలోని ప్రేక్షకుడికి నచ్చినవే ఎంచుకుంటాను. వాటిలో నాకు సూట్ అయ్యేవే నేను చేస్తాను. మిగిలినవి ఎవరు చేసినా బాగుంటాయి. యువ దర్శకులు కొత్త కొత్త కథలన్నీ చెబుతున్నారు. ఇన్ని కథలు విన్నవాడిగా చెబుతున్నా “తెలుగు సినిమా మారాదా..” అన్న మాట రానున్న రోజుల్లో వినపడదు. యువ దర్శకులకే పరిమితం అవుతున్నారన్న మాటకు స్పందిస్తూ “ఆ మాటకొస్తే.. నా వయసు హీరోల్లో సీనియర్ దర్శకులతో ఎక్కువ సినిమాలు చేసింది నేనే” అని బదులిచ్చారు. ఇదిలా ఉంటే త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో నాని నటిస్తోన్న ‘నేను లోకల్’ క్రిస్మస్ నాటికి విడుదల కానుంది.