‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రంలోని నాటు నాటు పాటకు ఆస్కార్ వచ్చింది. టాలీవుడ్ అంతా కాలర్ ఎగరేసుకుని ఆనందించాల్సిన సమయం ఇది. అయినా సరే కొంతమంది ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అన్నీ ఎలా ఉన్నా నిన్న టాలీవుడ్ మీడియాతో పాటు 24 క్రాఫ్ట్స్ మెంబర్స్ అంతా కలిసి ‘ఆర్.ఆర్.ఆర్’ టీం మెంబర్స్ ను సత్కరించారు. దీనిపై కూడా కొందరు విమర్శలు చేస్తున్నారు.వారిలో నిర్మాత నట్టికుమార్ కూడా ఒకరు. ఈ విషయం పై ఆయన మాట్లాడుతూ.. ” తెలుగు సినిమాకు ఆస్కార్ రావడం అందరూ గర్వించవలిసిన విషయం.
కానీ ఆస్కార్ గ్రహీతలకు సరైన గౌరవం దక్కలేదు అన్నది నా అభిప్రాయం. నిన్న జరిగిన ఈవెంట్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దలు ఎవ్వరూ రాలేదు. కేవలం సినిమాటోగ్రఫీ మంత్రి మాత్రమే వచ్చారు. ఈ కార్యక్రమం కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలతో ఎందుకు సంప్రదించలేదు? ఆస్కార్ సాధించినవాళ్లను అంత అర్జెంట్ గా ఎవరికీ తెలియకుండా ఎందుకు సన్మానించారు? నిన్న జరిగిన ఈవెంట్ గురించి చాలా మందికి సమాచారమే అందలేదు. సన్మానం చేయాలి. కానీ ఇది సరైన పద్ధతి కాదు.
ఈసీ అప్రూవల్ లేకుండా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుండి రూ.25 లక్షలు తీసి ఎలా ఖర్చు చేస్తారు? తెలంగాణ వచ్చాక ఇండస్ట్రీకి అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కానీ తెలంగాణలో చిన్న సినిమాలకు ఏం చేయట్లేదు. పెద్ద సినిమాలకు మాత్రమే గుర్తింపు వస్తుంది. చిన్న సినిమాలకు 5వ షో కావాలని చాలా కాలంగా అడుగుతున్నాం. దీనిపై ఇంతవరకు స్పందించింది లేదు. తెలంగాణలో ఎక్కువ లాభాలు వస్తున్నాయి అని శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
వాస్తవానికి ఇక్కడ 32% ఆదాయం వస్తే, ఆంధ్రప్రదేశ్లో 62% ఆదాయం వస్తుంది. అయినా అగ్రతాంబూలం తెలంగాణకే ఉంది. సినిమా ఇండస్ట్రీలో ఏపీ, తెలంగాణ అంటూ ఎలాంటి విభేదాలు లేవు. అందరం కలిసే ఉన్నాం. కానీ ఇలాంటివి అవసరమా?” అంటూ నట్టి కుమార్ కామెంట్ చేశారు.ప్రతిసారీ తన ఇంట్లోనే ఓ కాంట్రోవర్సియల్ ప్రెస్ మీట్ పెట్టి వార్తల్లో నిలుస్తుంటారు నిర్మాత నట్టి కుమార్. ఈసారి ‘ఆర్.ఆర్.ఆర్’ సాధించిన ఆస్కార్ పై డిస్కషన్ పెట్టారు కాబట్టి.. ఎక్కువ వార్తల్లో నిలిచారని చెప్పుకోవచ్చు.