ఫిబ్రవరి నెల 8వ తేదీన యాత్ర2 మూవీ థియేటర్లలో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. యాత్ర2 సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వొద్దంటూ తాజాగా నట్టికుమార్ కామెంట్లు చేయగా ఈ సినిమా ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకుందని సమాచారం అందుతోంది. యాత్ర2 మూవీకి సెన్సార్ పూర్తి కావడంపై నట్టికుమార్ మాట్లాడుతూ తాను ఈ నెల 22న సెన్సార్ బోర్డ్ కు లేఖ రాశానని అయితే జనవరి 23న ఈ సినిమాకు సెన్సార్ పూర్తైందని ఆయన అన్నారు.
చిన్న సినిమాలు ఎన్నో పెండింగ్ లో ఉన్నప్పటికీ ఈ సినిమాకు మొదట సెన్సార్ పూర్తి చేయడం జరిగిందని నట్టికుమార్ కామెంట్లు చేశారు. సినిమాల సెన్సార్ విషయంలో కొన్ని నిబంధనలు ఉంటాయని అయితే సెన్సార్ ఆఫీసర్ మాత్రం ఆ రూల్స్ పట్టించుకోకుండా యాత్ర2 సినిమాకు సెన్సార్ చేశారని ఆయన అన్నారు. యాత్ర2 సినిమాను చూశారా లేక సినిమా సినిమా చూడకుండానే సర్టిఫికెట్ ఇచ్చారా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
ఎవరి పలుకుబడితో ఈ సినిమాకు (Yatra2) సెన్సార్ పూర్తైందని ఆయన ప్రశ్నించారు. యాత్ర2 విషయంలో సెన్సార్ ఆఫీసర్ రూల్స్ పాటించలేదని అర్థమవుతోందని నట్టి కుమార్ అన్నారు. చంద్రబాబు, సోనియా గాంధీ, పవన్ లను కించపరిచేలా యాత్ర2 సినిమాలో సీన్స్ ఉన్నాయని లేఖ రాసినా సెన్సార్ ఆఫీసర్ ఆ లేఖను ఏ మాత్రం పట్టించుకోలేదని ఆయన చెప్పుకొచ్చారు.
హైదరాబాద్ లోని సెన్సార్ ఆఫీసర్ పై విచారణ జరగాలని ఆయన కామెంట్లు చేశారు. రాజకీయ నాయకులను అసభ్యంగా చూపించే సినిమాలకు ఎలా సెన్సార్ చేస్తున్నారని నట్టికుమార్ కామెంట్లు చేశారు. యాత్ర2 మూవీకి సర్టిఫికెట్ ఇచ్చిన ఆఫీసర్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. యాత్ర2 సినిమా విషయంలో రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపులు చోటు చేసుకుంటాయో చూడాలి. జీవా ప్రధాన పాత్రలో మహి వి రాఘవ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కింది.