మంచి ప్రేమించుకుని, చక్కగా పెళ్లి చేసుకొని, ఇద్దరు పిల్లలతో ఇప్పుడు ప్రశాంతంగా గడుపుతున్న జంటపై విమర్శలు చేయడానికి, లేని పోని అభాండాలు వేయడానికి ఎవరికి సరదాగా ఉంటుంది చెప్పండి. అయితే బాగున్న వారి గురించి ఏమన్నా అనడానికి ఎవరికి ఆసక్తి ఉంటుంది. ఇదంతా ప్రముఖ కథానాయిక నయనతారకు తెలియకుండా ఉంటుందా? కచ్చితంగా తెలిసే ఉంటుంది. అలాంటామె తన గురించి అందరూ అంటున్నారు అంటూ ఓ సెటైర్ వేసింది.
అయితే అలా అందరూ అనడానికి కారణం ఆమె చేసిన పనే అనే విషయం మరచిపోయింది. నయనతార – విఘ్నేశ్ శివన్ దంపతుల గురించి గత కొన్ని రోజులుగా రకరకాల వార్తలు వస్తున్నాయి. వాళ్ల మీద చిత్రీకరించిన ‘బియాండ్ ది ఫెయిరీ టేల్’ అనే డాక్యుమెంటరీ ఇప్పుడు వారి చుట్టూ వివాదాలు, కోర్టు కేసులు తెచ్చి పెట్టింది. రీసెంట్‌గా ‘చంద్రముఖి’ సినిమా టీమ్ కోర్టు కెళ్లింది. అంతకుముందు ప్రముఖ హీరో, నిర్మాత ధనుష్ ఆమె మీద కేసు పెట్టి నష్టపరిహారం ఇవ్వమని అడిగాడు.
ఇవే తేలడం లేదు అంటే నయన్ – విఘ్నేశ్ విడిపోతారు అంటూ ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ విషయం ఆ నోట, ఈ నోట పడి నయన్ వరకు వెళ్లినట్లుంది. దానిని ఖండిస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టింది. భర్త విఘ్నేశ్ శివన్‌తో కలసి దిగిన ఓ ఫొటోను షేర్ చేస్తూ ‘‘మాపై వచ్చే సిల్లీ రూమర్స్ చూసినప్పుడు మా రియాక్షన్ ఇదే’’ అని రాసుకొచ్చింది. ఆ ఫొటోలు ఇద్దరూ ఓవైపు తిరిగి చూస్తున్నట్లుగా ఉంది. అంటే ఈ విషయంలో మా అప్రోచ్ క్యాజువల్‌గా ఉంటుంది అని చెప్పాలని అనుకున్నట్లు ఉన్నారు.
ఇదంతా ఓకే కానీ.. అసలు ఆ పుకార్లు రావడానికి కారణం నయన్ చేసిన ఓ పోస్టే. వైవాహిక బంధం గురించి నయనతార కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టింది. ‘తెలివి తక్కువ వ్యక్తిని పెళ్లి చేసుకోవడం పొరపాటు. నీ భర్త తప్పులకు నువ్వు బాధ్యత వహించాల్సిన అవసరం లేదు’ అని ఆ పోస్టులో రాసి ఉంది. ఆ పోస్టు వైరల్ అవ్వడంతో ‘ఏంటీ నయన్ – విఘ్నేశ్ విడిపోతున్నారా’ అనే ప్రశ్న మొదలైంది. అయితే కాసేపటికే ఆ పోస్టు డిలీట్ చేసింది. కానీ విషయం జనాల్లో ఉండిపోయింది. ఇలా తనే తప్పు చేసి ఇతరుల మీద సెటైర్లు వేస్తే ఎలా?