మాస్ మహారాజా రవితేజ నటించిన ‘క్రాక్’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ మధ్యకాలంలో రవితేజ నటించిన సినిమాలు వరుసగా ప్లాప్ లు అవుతున్నప్పటికీ ఆ ఎఫెక్ట్ ఏదీ కూడా ‘క్రాక్’ మీద పడలేదు. ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో సినిమాకి హైప్ మరింత పెరిగింది. ఇప్పటివరకు విడుదలైన టీజర్, ట్రైలర్ లతో పాటు పాటలకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. గతంలో గోపీచంద్ మలినేని, రవితేజ కాంబినేషన్ లో వచ్చిన ‘డాన్ శీను’, ‘బలుపు’ లాంటి సినిమాలు హిట్ అవ్వడంతో మరోసారి వీరి కాంబినేషన్ లో వస్తోన్న ‘క్రాక్’ సినిమాపై అంచనాలు పెరిగాయి.
సంక్రాంతికి ఐదు రోజుల ముందుగానే సోలోగా ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. ప్రస్తుతానికి ఈ సినిమాకి సంబంధించి అంతా సానుకూలంగానే ఉంది. కానీ ఇలాంటి సమయంలో ఈ సినిమాకి వ్యతిరేకంగా ఓ వర్గం సోషల్ మీడియాలో నెగెటివ్ ప్రచారం చేస్తుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ సినిమా ఒక రొటీన్ రివెంజ్ డ్రామా అని.. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్లుగా లేదంటూ సోషల్ మీడియాలో ట్వీట్ లు చేస్తూ వైరల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.
వెరిఫైడ్ అకౌంట్ కలిగిన కొందరు కూడా ‘క్రాక్’ సినిమాకి ప్రీరిలీజ్ బజ్ లేదని.. అడ్వాన్స్ బుకింగ్స్ చాలా పూర్ గా ఉన్నాయంటూ పోస్ట్ లు పెడుతున్నారు. నిజానికి ఈ సినిమాకి మంచి హైప్ ఏర్పడింది. అలాంటిది ఇప్పుడు సినిమాపై నెగెటివ్ ప్రచారం చేస్తుండడంతో.. కావాలనే మాస్ రాజా సినిమాను టార్గెట్ చేసి ఉంటారనే అభిప్రాయాలు కలుగుతున్నాయి. మరి వీటన్నింటినీ దాటుకొని సినిమా హిట్ అవుతుందేమో చూడాలి!