మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు మోహన్ లాల్. ఆయనకు పోటీగా ఎంతమంది హీరోలున్నా.. వసూళ్ల పరంగా మాత్రం ఎప్పటికప్పుడు రికార్డులు సృష్టించింది మాత్రం మోహన్ లాల్ అనే చెప్పాలి. ‘దృశ్యం’ సినిమాతో రూ.50 కోట్ల కలెక్షన్స్ ను, ‘పులి మురుగన్’తో రూ.100 కోట్ల కలెక్షన్స్ ను సాధించి తన సత్తా చాటారు మోహన్ లాల్. ‘లూసిఫర్’ సినిమాతో పాత రికార్డులకు కూడా తిరగరాశారు. అయితే ‘లూసిఫర్’ తరువాత నుంచి వరుసగా బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అవుతున్నారు మోహన్ లాల్.
భారీ అంచనాల మధ్య విడుదలైన ‘బిగ్ బ్రదర్’, ‘మరక్కార్’, ‘ఆరట్టు’ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఇందులో ‘మరక్కార్’ సినిమా కోసం వంద కోట్లకు పైగా ఖర్చు పెట్టారు. కానీ సినిమా వర్కవుట్ అవ్వలేదు. రిలీజ్ కి ముందుకు మాత్రం జాతీయ ఉత్తమ చిత్రంగా అవార్డు పొందింది. ‘ఆరట్టు’ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ‘దృశ్యం2’, ‘బ్రో డాడీ’ వంటి సినిమాలు ఓటీటీలో విడుదలై మంచి టాక్ తెచ్చుకున్నప్పటికీ..
థియేటరికల్ రిలీజ్ తో మోహన్ లాల్ హిట్ కొట్టి చాలా కాలమవుతుంది. రీసెంట్ గా ‘మాన్‌స్టర్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు మోహన్ లాల్. ‘పులి మురుగన్’ సినిమాను డైరెక్ట్ చేసిన వైశాఖ్ ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమాతో కచ్చితంగా హిట్ కొడతానని భావించిన మోహన్ లాల్ కి నిరాశే ఎదురైంది. సరైన ఓపెనింగ్స్ కూడా రాలేదు.
గత కొన్నేళ్లలో అతి తక్కువ ఓపెనింగ్స్ తెచ్చుకున్న చిత్రంగా ‘మాన్‌స్టర్’ నిలుస్తోంది. ప్రస్తుతం మోహన్ లాల్ ‘బరోజ్’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఇందులో నటించడంతో పాటు దర్శకుడిగా కూడా వ్యవహరిస్తున్నారు. కనీసం ఈ సినిమాతోనైనా సక్సెస్ అందుకుంటారేమో చూడాలి!