సినిమా ఫంక్షన్లలకు చీఫ్ గెస్ట్‌ను పిలుస్తారు.. ఎందుకంటే ఆ సినిమా గురించి, ఆ సినిమాలో నటించిన వాళ్ల గురించి, ఆ సినిమాకు పని చేసిన వాళ్ల గురించి నాలుగు మంచి మాటలు చెబుతారని, దాని వల్ల సినిమాకు హైప్, క్రేజ్ పెరుగుతాయని. పనిలో పనిగా గెస్ట్ గురించి అక్కడివారు గొప్పగా చెప్పుకుంటారు. అయితే సినిమా గురించి చెప్పేదానికంటే.. గెస్ట్ గురించి చెప్పేది ఎక్కువైపోతే.. అప్పుడు అది ప్రీ రిలీజ్ ఈవెంట్ అనిపించుకోదు.
ఇటీవల కాలంలో ఇలాంటి ఈవెంట్లు కాస్త ఎక్కువయ్యాయా? ఏమో బన్నీ వెళ్తున్న ఈవెంట్లు చూస్తే ఇలానే ఉన్నాయంటున్నారు నెటిజన్లు. అల్లు అర్జున్ ఇటీవల కొన్ని సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్లకు హాజరయ్యాడు. అందులో ఒకటి తన సోదరుడు అల్లు శిరీష్ – అను ఇమ్మాన్యుయేల్ ‘ఊర్వశివో రాక్షసివో’ అయితే, రెండోది నిఖిల్ – అనుపమ పరమేశ్వరన్‌ల ‘18 పేజెస్’. ఈ రెండు ఈవెంట్లలో కామన్ పాయింట్లు కొన్ని చూసి నెటిజన్లు చేస్తున్న కామెంట్ల ఆధారంగానే మేం పైన రాసిన మాటలు తీసుకున్నాం.
ఆ రెండు సినిమాల గురించి కంటే.. బన్నీ రాబోయే సినిమా గురించే అక్కడ ఎక్కవ మాట్లాడుకున్నారు అనేది పాయింట్. కావాలంటే మీరే ఓసారి ఆ ఈవెంట్ల ఫుటేజ్ యూట్యూబ్‌లో చూడండి. ‘ఊర్వశివో రాక్షసివో’ ఈవెంట్ అంటే జరిగి కొన్ని రోజులు అయ్యింది. ఆ విషయం పక్కనపెడితే మొన్నీమధ్య జరిగిన ‘18 పేజెస్’ ఈవెంట్ తీసుకోండి. ఈ ఈవెంట్ మొత్తంలో ‘పుష్ప’, ‘బన్నీ’ నామ జపాలే ఎక్కువయ్యాయి. బన్నీని స్టేజీ మీదకు తీసుకెళ్లడానికి డ్యాన్సర్లతో పెద్ద హంగామానే చేయించారు కూడా.
ఇదంతా బన్నీ ఫ్యాన్స్‌కి చాలా ఆనందంగా అనిపించొచ్చు. కానీ ఈవెంట్ ఎవరిదో, ఎందుకు చేస్తున్నారో తెలియకుండా, మరచిపోయేలా బన్నీ గురించే భజన సాగితే ఈవెంట్ ఎందుకు మరి అని అంటున్నారు నెటిజన్లు. అయితే ఇదంతా బన్నీ కావాలని చేస్తున్నాడని కూడా అనలేం. అతని పీఆర్ టీమ్‌లో కొంతమంది అత్యుత్సాహపరులు, ఔత్సాహికులు ఇలాంటి పని చేస్తున్నారు అని అనుకోవచ్చు. ఒకరి ఈవెంట్‌కి వెళ్లి తమ సినిమాను ప్రమోట్ చేసుకోవాలని ఏ హీరో కూడా అనుకోరు కదా. అలా అనుకుంటే హీరోనే అవ్వడు అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.