ఈ సంక్రాంతికి ‘హను – మాన్’ రావాల్సిందే అంటూ పట్టుబట్టి మరీ విడుదల చేసుకున్న ప్రశాంత్ వర్మ – తేజ సజ్జా. ఎందుకంటే ఆ సినిమా మీద వాళ్లకున్న నమ్మకం అలాంటిదే. అనుకున్నట్లుగా సినిమా బాక్సాఫీసు దగ్గర భారీ విజయం అందుకుంది. చిన్న సినిమాల్లో పెద్ద విజయం అని లిస్ట్ రాస్తే… ఈ సినిమా తొలి స్థానంలో కూర్చొబెట్టేంత విజయం సాధించింది అని చెప్పొచ్చు. ఆ లెక్కన ఈ సంక్రాంతి మొత్తం హనుమంతుడిదే అంటున్నారు నెటిజన్లు.
అయితే, ఇప్పుడు చర్చ వచ్చే ఏడాది సంక్రాంతికి వెళ్లిపోయింది. ఎందుకంటే ఒక్క హనుమంతుడు వస్తేనే సంక్రాంతికి ఇలా అయితే, మరి ఇద్దరు హనుమంతులు వస్తే ఇంకెలా ఉంటుంది చెప్పండి. ఏంటి ఇద్దరు హనుమంతులా అదెలా సాధ్యం అని అనుకుంటున్నారా? ఇద్దరు హనుమంతులు అంటే హనుమంతుల సినిమాలు రెండు అని మా ఆలోచన. ‘హను – మాన్’ సినిమా ఆఖరులో ‘జై హనుమాన్’ అని మళ్లీ వస్తాం అని ప్రశాంత్ వర్మ చెప్పేశారు.
ఇక చిరంజీవి – వశిష్ట తెరకెక్కిస్తున్న ‘విశ్వంభర’ కూడా హనుమంతుడి నేపథ్యంలోనే సాగబోతోంది. ఈ మేరకు వాళ్లు రిలీజ్ చేసిన టైటిల్ కాన్సెప్ట్ వీడియోలో చెప్పేశారు కూడా. ఈ సినిమాను కూడా వచ్చే ఏడాది సంక్రాంతికే తీసుకొస్తామని చెప్పారు. ఆ లెక్కన వచ్చే ఏడాది సంక్రాంతికి ఇద్దరు హనుమంతులు బాక్సాఫీసు దగ్గరకు వస్తారు. ఇదిలా ఉండగా మెగా ఫ్యామిలీ నుండే మరో హనుమంతుడి భక్తుడి సినిమా కూడా వస్తోంది.
అయితే, ఆ సినిమా సంక్రాంతికి రాదు కానీ, దసరాకో దీపావళికో తీసుకొస్తారు అని టాక్. నిఖిల్ కథానాయకుడిగా చరణ్ ఓ నిర్మాతగా రూపొందుతున్న ‘స్వయంభు’లో హీరో హనుమంతుడి భక్తుడిగా కనిపిస్తాడు. ఈ సినిమా రిలీజ్ డేట్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేయలేదు కానీ… మరో ఆరు నెలల షూటింగ్ అయితే ఉంది అంటున్నారు. ఆ లెక్కన దసరా కానీ, దీపావళి సీజన్‌లో కానీ ఈ సినిమా వచ్చేయొచ్చు. ఆ లెక్కన ఈ ఏడాది హనుమంతుడి సందడి టాలీవుడ్‌లో ఎక్కువగా ఉండనుంది.