తెలుగు సినిమాకు సీక్వెల్స్ కానీ.. లేదా ఫ్రాంఛైజ్ సినిమాలు కానీ.. అచ్చిరావని మరోసారి రుజువైంది. ‘గబ్బర్ సింగ్’లోని హీరో క్యారెక్టర్ని తీసుకుని.. పవన్ కళ్యాణ్ అన్నీ తానై తీసిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఫలితమేంటో తొలి రోజే తేలిపోయింది. సినిమా మీద ఉన్న హైప్ వల్ల.. సమ్మర్ సీజన్లో రావడం వల్ల.. భారీగా రిలీజ్ చేయడం వల్ల.. ‘సర్దార్’ కలెక్షన్లు భారీగా ఉంటే ఉండొచ్చేమో కానీ.. పవన్‌కు కానీ, అతడి అభిమానులకు కానీ ఇది గుర్తుపెట్టుకోదగ్గ సినిమా అయితే కాదు. ‘సర్దార్’ ఫైనల్ రిజల్ట్ ఏంటన్నది వీకెండ్ అయ్యాక తేలిపోతుంది. మరి సినిమా చివర్లో వేసిన ‘రాజా సర్దార్ గబ్బర్ సింగ్’ టైటిల్ సంగతేంటన్నదే ఇప్పుడు తేలాల్సి ఉంది.
వ్యవహారం చూస్తే గబ్బర్ సింగ్ ఫ్రాంఛైజీని కొనసాగిస్తూ ఇంకో సినిమా చేయాలన్న ఆలోచన పవన్ అండ్ కోకు ఉన్నట్లు కనిపిస్తోంది. కానీ అందుకు అవకాశం ఉందా అన్నదే సందేహం. ఒకప్పుడు ‘మనీ’ సినిమాకు కొనసాగింపుగా ‘మనీ మనీ’ తీసి.. ఆ సినిమా చివర్లో కూడా ‘మనీ మనీ మనీ’ తీయబోతున్నట్లు ప్రకటించారు. కానీ ‘మనీ మనీ’ ఆడకపోవడంతో రెండో సీక్వెల్ తెరమీదికి రాలేదు. ‘సర్దార్’ విషయంలోనూ అదే జరిగే అవకాశాలున్నాయి. ‘గబ్బర్ సింగ్’ పాత్ర నుంచి పిండాల్సిందంతా ఆల్రెడీ పిండేశారు. ‘సర్దార్ గబ్బర్ సింగ్’లో చెప్పుకోవడానికి ఏమైనా ఉందంటే అది హీరో పాత్రే. ఐతే పవన్ అల్లరి వేషాలన్నీ ఈ సినిమాకే కొంచెం శ్రుతి మించినట్లుగా అనిపించాయి. ఇక తర్వాతి సినిమాకు వస్తే పవన్ అల్లరి వేషాలు చూడ్డానికి కూడా జనాలు ఇబ్బంది పడిపోవచ్చు. అయినా మూడేళ్లు శ్రమించి తీసిన సినిమా ఇలా తయారైంది. ఇక ఇంకో సినిమా కోసం ఇంకెక్కడ కష్టపడతాడు. అందులోనూ రిజల్ట్ కూడా పాజిటివ్‌గా లేదాయె. పైగా పవన్ చేస్తానంటున్నదే ఇంకో రెండో మూడో సినిమాలు మాత్రమే. కాబట్టి ‘రాజా సర్దార్ గబ్బర్ సింగ్’ విషయంలో అభిమానులు ఆశలేమీ పెట్టుకోకుంటే బెటర్.