‘దేశముదురు’ చిత్రం ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సప్తగిరి.. ‘పరుగు’ ‘కందిరీగ’ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ‘ప్రేమ కథా చిత్రం’ చిత్రమైతే ఇతని కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. ఆ తరువాత అతను వెనక్కి తిరిగి చూసుకోలేదు. స్టార్ హీరోల సినిమాల్లో కూడా ఇతనికి వరుస అవకాశాలు వచ్చాయి. అప్పుడు సూపర్ ఫామ్లో ఉన్న సప్తగిరి స్టార్ కమెడియన్ అయిపోయాడనే చెప్పాలి. బ్రహ్మానందం వంటి సీనియర్ కమెడియన్ ను కూడా భయపెట్టేసాడు.
అయితే తరువాత ఇతనికి హీరోగా అవకాశాలు వచ్చాయి. అటు వైపు బాగా మోజు పడి ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’ ‘సప్తగిరి ఎల్.ఎల్.బి’ వంటి చిత్రాలు చేసి అటువైపే వెళ్ళిపోవాలి అన్నట్టు ప్రయత్నించాడు. అయితే ఓ సందర్భం లో కామెడీని మాత్రం విడచి పెట్టను చెప్పినా.. హీరోగా చెయ్యడం వల్లే ఇతనికి శాపంగా మారింది. ఎందుకంటే హీరోగా చెయ్యడం మొదలుపెట్టాక.. ఇతని కాల్ షీట్లు ఖాళీగా ఉండవు అని భావించి చాలా మంది దర్శకులు ఇతన్ని సంప్రదించలేదట. ఇలా సప్తగిరి కోసం రెడీ చేసిన స్క్రిప్ట్ లు చిన్న కమెడియన్లకు లభించాయట.
కమెడియన్ గా వచ్చిన ఆఫర్లు చాలా వరకూ రిజెక్ట్ చేసాడట. పాత్ర నచ్చలేదు అనే చేసాడని తెలుస్తుంది కానీ హీరోగా చెయ్యాలనే వ్యామోహం వల్లే రిజెక్ట్ చేసాడు అనే వాదనా ఉంది. స్టార్ కమెడియన్ రేంజ్లో ఓ వెలుగు వెలిగిన సునీల్ హీరోగా మారిన తర్వాత కమెడియన్ గా చెయ్యడం మానేసాడు.ఇప్పుడు మళ్ళీ కమెడియన్ గా నిలబడడానికి గట్టి ప్రయత్నాలే చేస్తున్నా ఉపయోగం లేదు. సప్తగిరి కూడా కామెడీని వదలను అని పైకి ఎంత చెప్పినా.. సునీల్ చేసిన తప్పే చెయ్యడం వల్ల ఇప్పుడు కనీసం ఆఫర్లు లేక ఇబ్బంది పడుతున్నాడని తెలుస్తుంది.