మళ్ళీ థియేటర్లు మూతపడనున్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో కాదు ఢిల్లీలో..! కరోనా మళ్ళీ ఒమిక్రాన్ గా రూపం మార్చుకుని విజృంభిస్తున్న సమయంలో ఢిల్లీ సర్కారు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. గత రెండు రోజులుగా చేసిన కరోనా టెస్టుల్లో 0.5 శాతానికి పైగా పాజిటివ్ రేటు ఉండడాన్ని ప్రభుత్వం గుర్తించింది. అందుకే ముందస్తు జాగ్రత్తగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ‘ఢిల్లీలో కరోనా కేసులను కట్టడి చేయడానికి
మేము గతంతో కంటే 10 రెట్లు ఎక్కువగా జాగ్రత్త పడుతున్నాం’ అంటూ అక్కడి ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో సినిమా హాళ్ళు, మల్టీ ప్లెక్స్ లు మూసివేస్తున్నట్లు కూడా ప్రకటించారు. కరోనా వల్ల ఇప్పటికే చిత్ర పరిశ్రమ చాలా నష్టపోయింది. ఇంకా విడుదల కావాల్సిన పెద్ద సినిమాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు కేజ్రీవాల్ నిర్ణయంతో టాలీవుడ్లో పెద్ద సినిమాల నిర్మాతల్లో కంగారు మొదలైంది. ఎందుకంటే వాళ్ళని ఆదర్శంగా తీసుకుని..
ఇక్కడి ముఖ్యమంత్రులు కూడా ఆ దిశగా అడుగులు వేస్తె విడుదలకు సిద్ధంగా ఉన్న పెద్ద సినిమాలకి మళ్ళీ అడ్డంకులు ఎదురైనట్టే. అసలే పెద్ద సినిమాల నిర్మాతలు నెలకి భారీ మొత్తం ఇంట్రెస్ట్ లు కడుతున్న సందర్భాలను మనం చూస్తూ వస్తున్నాం. ‘ఆర్.ఆర్.ఆర్’ ‘రాధే శ్యామ్’ నిర్మాతలు అయితే నెలకి కోటి రూపాయలు పైనే ఇంట్రెస్ట్ లు కడుతున్నట్టు వినికిడి. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాల్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని.. నిర్మాతలు భావిస్తున్నారు. వీటికి నార్త్ కలెక్షన్లు కూడా చాలా కీలకం.