ఏదో ఒక టైములో హీరోకి ఓ భారీ సక్సెస్ వస్తుంది. ఆ సినిమా అనుకున్నంత హిట్ అయితే ప్రాబ్లెమ్ ఏమీ ఉండదు. అనుకున్నదానికి మించి హిట్ అయితే మాత్రం ఆ చిత్రాన్ని నిర్మాత హ్యాపీగా ఉన్నా.. దానిని తెరకెక్కించిన దర్శకుడికి, హీరోకి అదనపు భారం పెరుగుతుంది. రాజమౌళి వంటి సామర్ధ్యం కలిగిన దర్శకులకు అయితే పర్వాలేదు.. కానీ పూరి లాంటి కంగారు మాస్టర్ కు ఇబ్బంది. సరే అసలు విషయానికి వద్దాం.. 2003 లో ఎన్టీఆర్- రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన ‘సింహాద్రి’ చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ఆ సినిమాకి ఎన్టీఆర్ వయసు 20సంవత్సరాలు కూడా పూర్తవ్వలేదు.. కానీ ఆ చిత్రంతో స్టార్ హీరో అయిపోయాడు. అతని మార్కెట్ పదింతలు అయిపోయింది. చిరు, రజినీ కాంత్ లు కూడా అతని మాస్ పెర్ఫార్మన్స్ చూసి షాక్ తిన్నారు. తరువాతి సినిమాకి అతని పారితోషికం 3 ఇంతలు పెరిగింది. అలాంటి టైములో వచ్చిన మూవీ ‘ఆంధ్రావాలా’.అప్పటికి ‘అమ్మ నాన్న ఓ తమిళ్ అమ్మాయి’ ‘శివమణి’ వంటి హిట్లతో సూపర్ ఫామ్లో ఉన్నాడు పూరి. ‘ఆంధ్రావాలా’ ఆడియో కూడా సూపర్ హిట్ అయ్యింది. ఆ ఆడియో రిలీజ్ ఫంక్షన్లు చూసి బాలీవుడ్ మీడియా సైతం షాక్ తింది.
కానీ 2004.. జనవరి 1న విడుదలైన ‘ఆంధ్రావాలా’ చిత్రం ఘోర పరాజయం పాలయ్యింది. ఇక్కడ ఇంకో విచిత్రం ఏమిటంటే.. ‘ఆంధ్రావాలా’ ను అదే టైంలో కన్నడంలో పునీత్ రాజ్ కుమార్ తో ‘వీర కన్నడిగ’ గా రూపొందించాడు మెహర్ రమేష్. 2004 జనవరి 2న ఈ చిత్రం విడుదలయ్యింది. విచిత్రంగా ఇది సూపర్ హిట్ అయ్యింది. ఇక్కడ తెలుగు ఆడియెన్స్ యాక్సెప్ట్ చేయలేకపోయారా లేక ‘సింహాద్రి’ వల్ల పెరిగిన హైప్ ను ఇది మ్యాచ్ చెయ్యలేకపోయిందా? అనేది ఇప్పటికీ పెద్ద క్వశ్చన్?