‘హెబ్బా పటేల్ (Hebah Patel) ‘.. పరిచయం అవసరం లేని పేరు. గతంలో ఈమె కూడా టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. ‘అలా ఎలా’ తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈమె.. తర్వాత ‘కుమారి 21 ఎఫ్’ (Kumari 21F) తో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో ఆమె నటన కూడా హైలెట్ అయ్యింది. చాలా మంది అప్పట్లో ‘కచ్చితంగా ఈమె మరో సమంత అయిపోతుంది’ అని అనుకున్నారు కూడా..!
సుకుమార్ సమర్పణలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కూడా సూపర్ సక్సెస్ అందుకుంది. ‘కుమారి 21 ఎఫ్’ తర్వాత హెబ్బా చేసిన ‘ఈడో రకం ఆడో రకం’ (Eedo Rakam Aado Rakam) ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ (Ekkadiki Pothavu Chinnavada) కూడా కమర్షియల్ సక్సెస్లు అందుకున్నాయి. దీంతో ఆమెకు డిమాండ్ కూడా పెరిగింది. పెద్ద బ్యానర్ల నుండి అవకాశాలు రావడమే ఆలస్యమనుకుని ‘మిస్టర్’ (Mister) ‘అందగాడు’ (Andhhagadu) వంటి సినిమాల్లో చేసింది. అవి ఫ్లాప్ అయ్యాయి.
ఆ తర్వాత ‘భీష్మ’ (Bheeshma) సినిమాలో చేసిన కామియో కూడా ఈమెను రేసులో నుండి వెనక్కి లాగేసినట్టు అయ్యింది. అయితే సంపత్ నంది నిర్మాణంలో చేసిన ‘ఓదెల’ (Odela Railway Station) ఈమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ సినిమాలో మెయిన్ లీడ్ ఈమెనే. కోవిడ్ టైంలో ఓటీటీలో రిలీజ్ అయిన ఆ సినిమా.. ఇక్కడ మంచి రెస్పాన్స్ ను రాబట్టుకుంది. మంచి వ్యూయర్షిప్ ను సాధించి సూపర్ సక్సెస్ అందుకుంది. అందుకే ఈ సినిమాకి సీక్వెల్ గా ‘ఓదెల 2’ (Odela 2) కూడా వస్తుంది.
అయితే ‘ఓదెల 2’ లో తమన్నా (Tamannaah Bhatia) శివ శక్తిగా కనిపించనుంది. ఆమె స్టార్ హీరోయిన్ కాబట్టి.. సంపత్ నంది (Sampath Nandi) , దర్శకుడు అశోక్ తేజ (Ashok Teja)..ల ఫోకస్ కూడా ఆమె పైనే ఉంది. అందువల్ల హెబ్బా పాత్రని సైడ్ చేసేసినట్టు టాక్. చాలా వరకు సినిమాలో హెబ్బా పాత్ర నిడివి కూడా తగ్గించారట. కీలక సన్నివేశాలు కూడా ఎడిటింగ్లో లేపేశారని తెలుస్తుంది. ఈ విషయం హెబ్బాకి తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఆమె ఉందని ఇండస్ట్రీ టాక్. ఇక ‘ఓదెల 2’ ఏప్రిల్ 17న రిలీజ్ కాబోతోంది.