సంజయ్ వర్మ, గరీమా సింగ్ ప్రధాన పాత్రల్లో రూపొందిన తాజా చిత్రం ‘ఒక చిన్న విరామం’. సందీప్ చేగూరి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రంలో ‘బిగ్ బాస్3’ ఫేమ్ పునర్నవి భూపాలం, ‘కుమారి 21f’ నవీన్ నేని కీలక పాత్రలు పోషించారు. టైటిల్ మొదలుకుని టీజర్, ట్రైలర్ లు కొత్తగా మరియు ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో ఈ చిత్రం పై మంచి అంచనాలే నెలకొన్నాయి. మరి ఆ అంచనాల్ని ఈ చిత్రం ఎంత వరకూ అందుకుంది. మెప్పించిందా లేక నొప్పించిందా..? తెలుసుకుందాం రండి.
కథ: దీపక్ (సంజయ్ వర్మ) ఓ బిజినెస్మెన్. అతని భార్య సమీరా(గరీమా సింగ్) అతనికి సర్వస్వం. అయితే వ్యాపార లావాదేవీల్లో కొందరు దుండగులు అతన్ని డబ్బులు డిమాండ్ చేస్తారు. వారు చెప్పిన చోటుకి.. చెప్పిన వెళ్ళి ఇవ్వకపోతే … నిండు గర్భిణి అయిన దీపక్ భార్యను చంపేస్తాం అని బ్లాక్ మెయిల్ చేస్తారు. దీంతో వారడిగిన డబ్బు తీసుకుని వారు చెప్పిన చోటుకి బయలుదేరుతాడు దీపక్. ఈ క్రమంలో అతని కార్ రిపేర్ కు వస్తుంది. అందుబాటులో అతనికి అవసరమైన కార్ సర్వీస్ దొరకకపోవడంతో.. లిఫ్ట్ అడగడానికి ట్రై చేస్తాడు. ఈ నేపథ్యంలో బాల(నవీన్ నేని) , మాయ(పునర్నవి) అనే జంట దీపక్ కు వారి కారులో లిఫ్ట్ ఇవ్వడానికి అంగీకరిస్తారు.
ఎప్పుడూ గొడవలు పడుతూ ఉండే బాల, మాయలు.. ఓ సారి మరింత ఎక్కువగా గొడవపడతారు. ఈ క్రమంలో మాయ తన చేతిని కట్ చేసుకుని సూసైడ్ అటెంప్ట్ చేస్తుంది. మరి చివరికి మాయ బ్రతికిందా? అసలు దీపక్ ను బ్లాక్ మెయిల్ చేస్తున్న ఆ దుండగులు ఎవరు? ఓ పక్కన మాయను హాస్పిటల్ కు తీసుకువెళ్ళి బ్రతికించాడా..? లేక తన భార్యను కాపాడుకున్నాడా? అనేది మిగిలిన కథాంశం.
నటీనటుల పనితీరు: సంజయ్ వర్మ రిజర్వుడ్ గా ఉండే బిజినెస్ మాన్ గా పర్వాలేదు అనిపించాడు. ఎక్కువ ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చే రోల్ అతనిది కాదు కాబట్టి పాస్ మార్కులు వేయించుకుంటాడు. ఇక గరీమా సింగ్ ఎక్కువగా కనిపించదు. అయితే మొత్తం కథ మొత్తం ఈమె పాత్ర చుట్టూనే తిరుగుతుంది.ఇక పునర్నవి ఈసారి కొంచెం ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ట్రై చేసింది. చెప్పాలంటే పునర్నవికి ‘బిగ్ బాస్3’ తర్వాత మరింత క్రేజ్ సంపాదించుకుంది. ఈ చిత్రానికి క్రేజ్ రావడానికి కూడా పునర్నవినే కారణమని చెప్పడంలో అతిశయోక్తిలేదు. అయితే ఈమె పాత్రకి కూడా ఎక్కువ స్కోప్ ఇవ్వకపోవడం డిజప్పాయింట్మెంట్ అని చెప్పాలి. ఇక ‘కుమారి 21f’ ఫేమ్ నవీన్ తన మార్క్ ఎంటర్టైన్మెంట్ తో అక్కడక్కడా నవ్వులు పూయించాడు.
సాంకేతికవర్గం పనితీరు: సినిమాటోగ్రఫర్ రోహిత్ ఈ చిత్రానికి మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఓ చిన్న సినిమా అనే ఫీలింగ్ రాకుండా మంచి విజువల్స్ అందించడంలో సక్సెస్ అయ్యాడు. ఎక్కువగా ఈ చిత్రం రాత్రిపూట జరుగుతుంది కాబట్టి ఆ ఫీల్ ను చివరి వరకూ క్యారీ చేసాడు రోహిత్. ఇక భరత్ అందించిన పాటలు గుర్తుండకపోగా విసిగిస్తాయి. అయితే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో మాత్రం ఆకట్టుకున్నాడు. ఇక దర్శకుడిగానే కాకుండా నిర్మాతగా కూడా ఈ చిత్రానికి అన్నీ తానై నడిపించిన సందీప్ చేగూరి విషయానికి వస్తే.. చిన్న సినిమా కాబట్టి నిర్మాణ విలువల్ని పెద్దగా ఎవ్వరూ లెక్కలోకి తీసుకోరు.
కానీ ఆ విషయంలో పర్వాలేదు అనిపించాడు. సినిమాలో లిమిటెడ్ క్యారెక్టర్స్ ఉండేలా చూసుకున్నాడు. సినిమా మొత్తం ఒక కారు, ఇల్లు, రోడ్డు మీదే ప్లాన్ చేసుకున్నాడు.. కథకి ఆ మాత్రం చాలు అనిపిస్తాయి కాబట్టి నిర్మాతగా అతని ప్లానింగ్ కు మెచ్చుకోవాలి. అయితే అతను రాసుకున్న పాయింట్ ను.. దర్శకుడిగా ఎగ్జిక్యూట్ చేసే విషయంలో మాత్రం అతను తడబడ్డాడని క్లియర్ గా తెలుస్తుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం కథలో వేగం కనిపించకపోయినా పునర్నవి, నవీన్ ఎంటర్టైన్మెంట్ తో పర్వాలేదు అనిపిస్తాడు. ఇక ఇంటర్వెల్ దగ్గర సెకండ్ హాఫ్ లో ఏదో ఉంది అనే యాంగ్జైటీ క్రియేట్ చేసాడు. సెకండ్ హాఫ్ స్టార్టింగ్ లో కూడా అదే సస్పెన్సు మైంటైన్ చేస్తూ క్లయిమాక్స్ వరకూ తీసుకెళ్తాడు. అయితే చివరిగా వచ్చే ట్విస్ట్ లు మాత్రం చాలా సిల్లీగా అనిపిస్తాయి. థ్రిల్లర్ సినిమాలకు లాజిక్ లు చాలా అవసరం అన్న విషయాన్ని దర్శకుడు సందీప్ గాలికి వదిలేసినట్టు అనిపిస్తుంది.
విశ్లేషణ: మొత్తంగా ‘ఒక చిన్న విరామం’ చిత్రం ఒకింత ఎంగేజ్ చేస్తుంది కానీ ఎంటర్టైన్ అయితే చెయ్యదు. టీజర్, ట్రైలర్ లో కనిపించే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్.. కోసం సినిమాకి వస్తే నిరాశ తప్పదు. అవన్నీ పక్కన పెట్టేస్తే..రన్ టైం 2 గంటల లోపే ఉంది కాబట్టి..టైం పాస్ కి ఓసారి ట్రై చెయ్యొచ్చు.