‘గుంటూరు కారం’ సినిమా తర్వాత దర్శకుడు త్రివిక్రమ్ సినిమా ఏంటి? ‘పుష్ప: ది రూల్’ తర్వాత అల్లు అర్జున్ చేసే మూవీ ఏంటి? ఈ రెండు ప్రశ్నలకు ఒకటే సమాధానం. ఇద్దరూ కలసి సినిమా చేస్తున్నారు అని. అయితే ఆ సినిమా ఉంటుందా? ఉండదా అని గత కొన్ని రోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ఈ పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టేలా ఓ న్యూస్ బయటికొచ్చింది. అదే ఈ సినిమాలో బన్నీ తెలంగాణ యువకుడిగా కనిపిస్తాడు అని. నిజానిజాలేంటో తెలియదు కానీ… సినిమా అయితే ఉంది అని చెప్పొచ్చు.
‘గుంటూరు కారం’ సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ ఏం చేస్తున్నారో తెలియడం లేదు. ఆయన కథ, రచన, సినిమా నడిపించే విధానం విషయంలో ఆ సినిమా నేపథ్యంలో పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. అయితే డిజాస్టర్లు, ఫ్లాప్‌లు వచ్చిన తర్వాత ఆయన అల్లు అర్జున్‌తో కలసి చేసిన సినిమాలు బ్లాక్‌బస్టర్‌లు అయ్యాయి. దీంతో అర్జెంట్‌గా ఆయన బన్నీతో సినిమా చేయాలి అని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అందుకు తగ్గట్టే ఆయన రాసుకుంటున్న కథలో బన్నీ పాత్ర తెలంగాణ కుర్రాడిలా ఉంటుంది అని పుకార్లు వస్తున్నాయి.
అంటే ‘పుష్ప’ సినిమాల్లో రాయలసీమ మాండలికంలో డైలాగులు చెప్పిన / చెబుతున్న బన్నీ… ఇప్పుడు తన తర్వాతి సినిమా కోసం తెలంగాణ మాండలికంలో డైలాగ్‌లు పలుకుతాడన్నమాట. దీని కోసం బన్నీకి ఆ యాస విషయంలో శిక్షణ ఇస్తారు అని చెబుతున్నారు. గతంలో ‘రుద్రమదేవి’ సినిమాలో గోన గన్నారెడ్డిగా బన్నీ తెలంగాణ మాండలికంలో డైలాగ్స్ చెప్పాడు. వాటికి మంచి స్పందనే వచ్చింది. మళ్లీ ఇప్పుడు త్రివిక్రమ్ సినిమా కోసం మరోసారి అదే మాండలికంలో డైలాగ్స్ పలకబోతున్నాడన్నమాట.
‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘అల వైకుంఠపురములో..’ లాంటి సూపర్ హిట్‌ల తర్వాత (Allu Arjun) అల్లు అర్జున్ – త్రివిక్రమ్ మరోసారి ఈ సినిమా కోసం జట్టు కట్టారు. ఇప్పటికే హ్యాట్రిక్ కొట్టిన ఈ టీమ్… కొత్త హ్యాట్రిక్ ఈ సినిమాతో షురూ చేయనుంది. రూ. 300 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్‌లో నిర్మిస్తున్నారు.