కొందరు హీరోలు ఆన్ స్క్రీన్ పైనే కాకుండా తమ చర్యలతో ఆఫ్ స్క్రీన్ హీరోలు అనిపించుకుంటారు. పెట్టే చోటే తెలుస్తుంది ఎవరిది పెద్ద చేయి అనే విషయం. ఇప్పుడు ప్రభాస్ ని కూడా అందరూ అలానే పొగిడేస్తున్నారు. రెబెల్ స్టార్ ప్రభాస్ రియల్ బాహుబలి అని ఆయన దాన గుణాన్ని కొనియాడుతున్నారు. టాలీవుడ్ లో స్టార్ హీరోలలో ఒకరిగా ఉన్న ప్రభాస్ సహాయం చేయడంలో ఓ మెట్టు పైనే అని నిరూపించాడు.
కరోనా వ్యాప్తిని అరికట్టే పనిలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మద్దతుగా టాలీవుడ్ హీరోలందరూ విరాళాలు ప్రకటించారు. ఐతే వారందరి కంటే భారీ విరాళం ప్రకటించి ప్రభాస్ తాను ప్రత్యేకం అని నిరూపించుకున్నాడు. టాలీవుడ్ నుండి ప్రభాస్ మాత్రమే 4 కోట్ల రూపాయల భారీ ఆర్థిక సాయం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రకటించడం జరిగింది. 3 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి సాయంగా పీఎం రిలీఫ్ ఫండ్ కి ప్రకటించిన ప్రభాస్, ఏపీ మరియు తెలంగాణా రాష్ట్రాలకు చెరో 50లక్షల చొప్పున ఆర్థిక సాయం చేశారు.
ఇక హీరో కమ్ పొలిటీషియన్ గా ఉన్న పవన్ కళ్యాణ్ సైతం కేవలం 2 కోట్లు విరాళం మాత్రమే ప్రకటించారు. ప్రభాస్ తరువాత టాలీవుడ్ నుండి పవన్ కళ్యాణ్ ఉన్నారు. కాగా కరోనా క్రైసిస్ ఛారిటీ పేరుతో టాలీవుడ్ లోని డైలీ వేజ్ వర్కర్స్ సహాయార్థం విరాళాలు సేకరిస్తుండగా ఈ నిధికి ప్రభాస్ 50లక్షలు ప్రకటించారు. ఇక్కడ కూడా ప్రభాస్ అందరి కంటే అధిక మొత్తం ప్రకటించడం జరిగింది. ఇలా ప్రభాస్ దానంలో కర్ణుడంతటి వాడు అని అనిపించుకుంటున్నాడు.