ప్రపంచంలో సినిమా జనాలు గొప్పగా భావించే అవార్డు ఏదైనా ఉందా అంటే అది ఆస్కార్ వేడుక అనే చెప్పాలి. అకాడెమీ అవార్డుగానూ పిలిచే ఈ పురస్కారం కోసం ఏటా జాబితా విడుదల చేస్తుంటారు. గతేడాది ఈ వేడుక మనకు ఎన్నో తీపి గురుతులు ఇచ్చింది. తెలుగు చిత్రం ‘RRR’, డాక్యుమెంటరీ ‘ది ఎలిఫెంట్ విష్పర్స్’కు అవార్డులు వచ్చిన విషయం తెలిసిందే. ఈసారి ఆ అవకాశం లేదు. అయితే మన దేశంలో షూటింగ్ జరుపుకున్న ఓ సినిమా అవార్డుల బరిలో నిలిచింది.
2024 ఆస్కార్ అవార్డుల (ముఖ్య) కోసం వివిధ కేటగిరీల్లో పోటీ పడే చిత్రాల జాబితా ఇలా ఉంది. ఉత్తమ చిత్రం పురస్కారం కోసం అమెరికన్ ఫిక్షన్, అటానమీ ఆఫ్ ఎ ఫాల్, బార్బీ, ది హోల్డోవర్స్, కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్, మ్యాస్ట్రో, ఒపెన్ హైమర్, పాస్ట్ లైవ్స్, పూర్ థింగ్స్, ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ చిత్రాలు ఉన్నాయి. ఇక ఉత్తమ దర్శకుడు అవార్డు కోసం జస్టిన్ ట్రియట్ (అటానమీ ఆఫ్ ఎ ఫాల్), మార్టిన్ స్కోర్స్ (కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్), క్రిస్టోఫర్ నోలన్ (ఓపెన్ హైమర్), యోర్గోస్ (పూర్ థింగ్స్), జొనాథన్ గ్లేజర్ (ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్) నిలిచారు.
బ్రాడ్లీ కూపర్ (మేస్ట్రో), కోల్మన్ డొమింగో (రస్టిన్), పాల్ జియామటి (ది హోల్డోవర్స్), కిలియన్ మర్ఫీ (ఓపెన్ హైమర్), జెఫ్రీ రైట్ (అమెరికన్ ఫిక్షన్) ఉత్తమ నటుడు పురస్కారం కోసం బరిలో నిలవగా… ఉత్తమ నటి అవార్డు కోసం అనెటే బెనింగ్ (నయాడ్), లిల్లీ గ్లాడ్‌స్టోన్ (కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్), సాండ్రా హూల్లర్ (అటానమీ ఆఫ్ ఎ ఫాల్), కెర్రీ ములిగన్ (మేస్ట్రో), ఎమ్మా స్టోన్ (పూర్ థింగ్స్) ఉన్నారు.
డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో భారతీయ కథ ‘టు కిల్ ఏ టైగర్’ (Osce) ఆస్కార్‌కి పోటీ పడుతోంది. డిల్లీలో పుట్టి, కెనడాలో స్థిరపడ్డ నిషా పహూజా తెరకెక్కించారు. ఇక 96వ ఆస్కార్ అవార్డుల వేడుక లాస్ ఏంజిలెస్‌లోని డాల్బీ థియేటర్‌లో జరుగుతుంది. మార్చి 10న అవార్డుల వేడుకను నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. మన కాలమానం ప్రకారం మార్చి 11న వేకువజామున పురస్కార ప్రదానోత్సవం ఉంటుంది. ఈ ఏడాది కూడా జిమ్మీ కిమ్మెల్ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. ఆయనకు ఇది వరుసగా నాలుగోసారి.