ప్రపంచంలోనే ఉత్తమ ప్రేక్షకులు ఉన్న ఏకైక రాష్ట్రం మన ఉమ్మడి తెలుగు రాష్ట్రం. నటీనటులు ఎవరన్నది పట్టించుకోరు, ఈ బాష నుంచి అనువదించారు అనేది అవసరం లేదు, నేటివిటీ అనేది అసలు సమస్యే కాదు. కంటెంట్ బాగుంటే చాలు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, ఒడియా సినిమాను తెలుగులో అనువదించినా థియేటర్లకు తరళి వెళ్ళి కాసుల వర్షం కురిపిస్తారు. అలాంటి తెలుగు ప్రేక్షకులన్నా, తెలుగు భాషన్నా ఒటీటీ ఈమధ్య బాగా చులకన అయిపోయింది. సాధారణంగా థియేట్రికల్ రిలీజులంటే రీజనల్ ఎడిటర్స్ & రైటర్స్ సహాయం తీసుకొని వీలైనంతవరకూ సందర్భాన్ని, స్థితిగతులను తెలుగీకరించడానికి ప్రయత్నిస్తారు.
ముఖ్యంగా తెలుగు డబ్బింగ్ వెర్షన్ లో గోడల మీద తమిళ రాతలు కనబడకుండా తెలుగుతో కవర్ చేస్తారు. అలాగే.. పాటలు కూడా వీలైనంతవరకూ తెలుగులో చక్కని భావం వచ్చేలా అనువాదిస్తారు. సిరివెన్నెల, ఆరుద్ర, వేటూరి వంటి ప్రఖ్యాతులు కూడా తమదైన శైలిలో డబ్బింగ్ పాటలను కూడా సెన్సేషనల్ హిట్స్ గా మరిచారు. అయితే.. కరోనా కారణంగా పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన ఒటీటీలు మాత్రం తెలుగు అనువాదానికి కానీ, తెలుగు ప్రేక్షకుల మనోభావాలకు కానీ కనీస స్థాయి మర్యాద ఇవ్వడం లేదు. గత నెల అమేజాన్ ప్రైమ్ లో విడుదలైన “సార్పట్ట” చిత్రంలో పోస్టర్ల మీద తెలుగు కనిపించినప్పుడల్లా మనసు చివుక్కుమంటుంది.
సినిమా మొత్తం తెలుగు గూగుల్ ఫాంట్స్ బోలెడు కనిపిస్తుంటాయి. డైలాగ్స్ & సాంగ్స్ విషయంలో ప్రైమ్ సంస్థ చూపిన శ్రద్ధ, తెలుగు ఫాంట్స్ మీద ఎందుకు చూపలేదో అర్ధం కాదు. సినిమా ఎంత అద్భుతంగా ఉన్నప్పటికీ.. తెలుగును అవహేళణ చేశారనే బాధ మాత్రం మింగుడుపడలేదు. ఇక నిన్న నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన “నవరస” తెలుగు వెర్షన్ చూస్తే.. తెలుగు ప్రేక్షకులంటే మరీ ఇంత చులకనా అనిపించింది. కనీసం టైటిల్స్ తెలుగీకరించలేదు సరికదా పాటల్ని మళ్ళీ డబ్ చేయడం ఎందుకు తమిళ పాటలే ఉంచేశారు. తెలుగు డైలాగులు, మధ్యలో తమిళ పాట వినడానికి చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. నెట్ ఫ్లిక్స్ సౌత్ అని సపరేట్ ట్విట్టర్ ఎకౌంట్ మైంటైన్ చేయడంలో నెట్ ఫ్లిక్స్ చూపిన శ్రద్ధ, తెలుగు ప్రేక్షకులను గౌరవించడంలోనూ చూపించి ఉంటే బాగుండేది.
వీళ్ళంటే అంతర్జీయ సంస్థలు కాబట్టి తెలుగు భాష మీద గౌరవం లేదు అనుకోవచ్చు. మన అచ్చ తెలుగు ఒటీటీ అయిన ఆహా కూడా పలు పరాయి భాషా చిత్రాలను అనువదిస్తూ కనీస స్థాయి జాగ్రత్తలు తీసుకోవడం లేదు. ఈమధ్య కాలంలో విడుదలైన కొన్ని సినిమాల్లోని తెలుగు వెర్షన్ పాటలు వింటే.. తెలుగుకి ఎందుకురా తెగులు పట్టిస్తున్నారు అని తిట్టుకోవడం తప్ప చేసేదేమీ లేక మిన్నకుండిపోయారు తెలుగు భాషాభిమానులు. బాబూ ఒటీటీదారులారా.. తెలుగు మార్కెట్ మీకు అత్యంత ముఖ్యమైనది. ఆ విషయం మాకంటే ఎక్కువగా మీకే తెలుగు. దయచేసి తెలుగు భాషను తక్కువచ్చేసి చూసి ఏం చేసినా, ఎలా రాసిన చూస్తారు అని అవహేళనా భావంతో సినిమాలను/సిరీస్ లను అనువదించకండి. కనీస స్థాయి మర్యాద ఇవ్వండి.