ఎన్ని చట్టాలు వచ్చినా అత్యాచారాలు ఆగడం లేదు. లైంగిక దాడికి గురైన అమ్మాయిలకు సరైన న్యాయం జరగడంలేదు. ఈ విషయం అమెరికాలోను చర్చకు దారితీసింది. అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ సుప్రీంకోర్టుకు నామినేట్ చేసిన జడ్జి బ్రెట్ కేవెనాపై ఇద్దరు మహిళలు అత్యాచార ఆరోపణలు చేయడం సంచలనంగా మారిన నేపథ్యంలోనే న్యూయార్క్ టైమ్స్‌లో భారత సంతతి మోడల్, అమెరికాలో టెలివిజన్ ప్రయోక్త అయిన పద్మలక్ష్మి గురించి వ్యాసం ప్రచురితమైంది. న్యూయార్క్ టైమ్స్ పత్రికకు రాసిన వ్యాసంలో ఆమె.. తనకు పదహారేళ్ల వయసున్నప్పుడు నూతన సంవత్సర వేడుకలు జరుగుతున్న సమయంలో బాయ్‌ఫ్రెండే తనపై అత్యాచారం చేశాడని చెప్పారు. ”అప్పుడు నేను స్కూల్ ముగిశాక లాస్ ఏంజెల్స్ లోని ఒక మాల్‌లో పనిచేసేదాన్ని. అక్కడే పరిచయమైన కుర్రాడితో డేటింగ్ మొదలైంది. అతను కాలేజిలో చదువుకుంటూనే ఓ మెన్స్‌వేర్ దుకాణంలో పనిచేసేవాడు.
అతడికి 23.. నాకు 16. అలా పరిచయం కొనసాగుతున్న సమయంలోనే కొత్త సంవత్సరం వేడుకల రోజున ఇద్దరం కలిసి పార్టీకి వెళ్లాం. అక్కడి నుంచి అతని అపార్ట్‌మెంట్‌కి వెళ్లాను. అలసిపోవడంతో మాట్లాడుతూ నిద్రపోయాను. అంతలోనే రెండు కాళ్ల మధ్యా కత్తితో కోస్తున్నంతగా నొప్పి… ఆ నొప్పికి మెలకువ వచ్చేసింది, కళ్లు తెరిచి చూసేసరికి అతడు నాపై ఉన్నాడు. ‘ఏం చేస్తున్నావ’ని అడిగాను. ‘కొద్దిసేపే ఈ నొప్పి ఉంటుంది’ అన్నాడు. ‘ప్లీజ్ ఆ పని మాత్రం చేయొద్దు’ అంటూ గట్టిగా అరిచాను. అయినా వినకపోవడంతో భయంతో ఏడ్చాను. ‘నిద్రపోయుంటే ఇంత ఉండేది కాదు కదా’ అంటూ నాపైనుంచి లేచాడు. ఆ తర్వాత నన్ను ఇంటి దగ్గర వదిలాడు” అని పద్మలక్ష్మి తన వ్యాసంలో ఆ నాటి ఘటనను రాసుకొచ్చారు. తన పొరపాటు వల్లే లైంగికదాడికి గురైనట్లు భావించేదానినని.. మహిళలు తమపై జరిగే లైంగిక దాడుల గురించి బయట ప్రపంచానికి ఎందుకు చెప్పరో కూడా తనకు ఆ తర్వాతే అర్థమైందని ఆమె పేర్కొన్నారు. ఈ వ్యాసం ప్రస్తుతం అనేక దేశాల్లో హాట్ టాపిక్ అయింది.