పాకిస్థాన్ నటి సభా ఖమర్ ఇబ్బందుల్లో పడ్డారు. మసీద్ పవిత్రతకు భంగం కలిగించిందని.. పాకిస్థాన్ కోర్టు ఆమెకి అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ‘హిందీ మీడియం’ సినిమాలో నటించిన సభా ఖమర్ లాహోర్ లోని ఓ పురాతన మసీద్ లో పాకిస్థానీ సింగర్ బిలాల్ సయూద్ తో కలిసి ఓ డాన్స్ వీడియోలు నటించింది. ఇది చాలా మందిని ఆగ్రహానికి గురిచేసింది. మసీదు పవిత్రతకు భంగం కలిగించారంటూ వీరిద్దరిపై కేసు పెట్టారు.
పాకిస్థాన్ శిక్షాస్మృతిలోని సెక్షన్ 295 కింద లాహోర్ పోలీసులు గతేడాది ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీనికి సంబంధించిన విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు పంపినా.. వారిద్దరూ ఏవో కారణాలు చెబుతూ తప్పించుకుంటున్నారు. తాజాగా ఈ కేసును విచారించిన లాహోర్ మెజిస్టీరియల్ కోర్టు సభాతో పాటు బిలాల్ కు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 6కి వాయిదా వేసింది. ఇదిలా ఉండగా.. ఈ డాన్స్ వీడియో విషయంలో కొందరు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా సభా, బిలాల్ ను చంపేస్తామంటూ బెదిరించారు.
దీంతో సభా క్షమాపణలు కోరుతూ కొన్ని కామెంట్స్ చేసింది. ఆ వీడియో కేవలం పెళ్లికి సంబంధించిన కార్యక్రమాలు చిత్రీకరించినట్లు తెలిపింది. కాగా.. సభా ‘హిందీ మీడియం’తో పాటు పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించింది. ఈ సినిమాలు నటిగా ఆమెకి మంచి గుర్తింపు తీసుకొచ్చాయి.