అంటే అన్నాం అంటారు కానీ… పులిని చూసి నక్క వాతలు పెట్టుకోకూడదు. అలా పెట్టుకుంటే పులి అవ్వడం పక్కన పెడితే.. ఒళ్లు కాలి బాధపడాల్సి ఉంటుంది. మేం చెప్పింది కాస్త హార్స్ గానే ఉండొచ్చు కానీ.. ఆలోచిస్తే ఇండస్ట్రీకే మంచిది. ఒక హీరో ఏం చేస్తే మిగిలిన హీరోలు అటువైపు వెళ్లడం మనం చాలాసార్లు చూశాం. మాస్ సినిమాలు చేస్తే మాస్ సినిమాలు, ప్రయోగాలు చేస్తే ప్రయోగాలు అని అంటుంటారు. ఇప్పుడు పాన్ ఇండియా మంత్రం పట్టుకున్నారు. దీంతో చిన్నపాటి భయం అయితే వేస్తోంది.
ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు పెద్దలు. అంటే ఇక్కడ సరైన హిట్‌కొట్టి కెరీర్ స్ట్రాంగ్ చేసుకున్నాక అప్పుడు పక్క ఇండస్ట్రీలకు వెళ్లాలి. అయితే ఇక్కడే డక్కాముక్కీఉల తింటున్న వారు పక్క వుడ్‌లకు వెళ్లడం ఇబ్బందే. తెలుగుతో పాటు పక్క పరిశ్రమలోకి సినిమాను డబ్ చేయడం కొత్తేమీ కాదు. అయితే పాన్ ఇండియా అంటూ నాలుగైదు భాషల్లోకి సినిమాను తీసుకెళ్లడం కాస్త ఇబ్బందే అని చెప్పొచ్చు. సరైన విజయం రాక చాలా రోజులుగా వెయిట్ చేస్తున్న హీరో ఒకరు, విజయం వచ్చినా చాలినంత వసూళ్లు లేక ఇబ్బందులు పడుతున్న హీరో ఒకరు..
ఇటీవల తమ పాన్ ఇండియా అప్రోచ్ గురించి చెప్పారు. దీంతోనే ‘పాన్ ఇండియా ఎందుకు?’ అనే ప్రశ్న వస్తోంది. ‘బాహుబలి’తో వరల్డ్ వైడ్ ఫేమ్ తెచ్చుకున్న ప్రభాస్‌కే తర్వాతి రెండు పాన్ ఇండియా సినిమాలు ఇబ్బందికర ఫలితం తీసుకొచ్చాయి. అలాంటప్పుడు పాన్ ఇండియా కథలు, ఆలోచనలు అవసరమా అని ఆ కుర్ర హీరోల అభిమానులు అనుకుంటున్నారు. పాన్ ఇండియా అని చెప్పేసి, పోస్టర్ మీద ఐదేసి భాషల పేర్లు రాసేసి, ఏదో అన్ని దగ్గర్లా విడుదల చేసేసి బొక్క బోర్లా పడిన సినిమాలు ఈ మధ్య వచ్చాయి.
కొన్ని అయితే హిందీ రిలీజ్ అనే పేరు చెప్పి.. చేయలేకపోయారు కూడా. మొన్నీమధ్య నాని ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాను తమిళ, మలయాళంలో విడుదల చేశారు. ప్రభావం ఏమంత ఆశాజనకంగా లేదు అని చెప్పొచ్చు. ఇప్పుడు ‘అంటే సుందరానికీ’ కూడా అలానే విడుదల చేస్తామని చెబుతున్నారు. ఇక నిఖిల్ కూడా తన సినిమా ‘స్పై’ని ఐదు భాషల్లో అంటే పాన్ ఇండియా లెవల్‌లో విడుదల చేస్తా అంటున్నాడు. ఇటీవల పోస్టర్ కూడా విడుదల చేశారు. నిఖిల్ సత్తా అంటే నిఖిల్‌కి తెలుసు. అందుకే విడుదల చేస్తా అంటున్నాడు. మరి ఆశించిన విజయం దక్కుతుందా? పాన్ ఇండియా నక్క వాతలులా మారుతుందా?