‘ఖుషి’ తర్వాత పవన్ కళ్యాణ్ దాదాపు 10 ఏళ్ళ పాటు సరైన హిట్టు లేక ఇబ్బంది పడుతున్న రోజులవి. ‘జల్సా’ వచ్చి నవ్వించినా అభిమానుల ఆకలి అయితే తీర్చిన సినిమా అని చెప్పలేం. ఇక దాని తర్వాత ‘కొమరం పులి’ ‘తీన్ మార్’ వంటి సినిమాలు వచ్చి డిజాస్టర్స్ గా మిగిలిపోయాయి. అలాంటి టైంలో తమిళంలో ప్లాప్ అంటూ లేని దర్శకుడు విష్ణువర్ధన్ తో పవన్ కళ్యాణ్ ఒక సినిమా చేస్తున్నాడు అంటే.. కచ్చితంగా అది సూపర్ హిట్ అవుతుంది అని అంతా అనుకున్నారు.
పైగా ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్ పాత్ర పోషిస్తున్నాడు అని తెలియగానే అంచనాలు ఎక్కడికో వెళ్లిపోయాయి. ఇక దాని టైటిల్ ‘పంజా’ అని రివీల్ చేశాక.. టీజర్ రిలీజ్ అయ్యాక అంచనాలు ఆకాశాన్నంటాయి అనే చెప్పాలి. వాస్తవానికి ఆ టైంలో ‘గబ్బర్ సింగ్’ పై కంటే కూడా ‘పంజా’ పైనే ఎక్కువ హోప్స్ పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు.
మేకోవర్ కొత్తగా ఉండటం.. బ్లాక్ ఔట్ ఫిట్స్ లో వచ్చిన పవన్ కళ్యాణ్ స్టిల్స్ అన్నీ యమ స్టైలిష్ గా ఉండటంతో ‘పంజా’ మేనియా అంతకంతకూ పెరుగుతూనే వచ్చింది. అయితే 2011 డిసెంబర్ 9న రిలీజ్ అయిన ‘పంజా’ పెద్ద ప్లాప్ గా మిగిలిపోయింది. తర్వాత టీవీల్లో చూసి సినిమా బాగుందని కామన్ ఆడియన్స్ అనుకున్నా.. భారీ అంచనాల నడుమ ఆ సినిమా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని మెప్పించలేకపోయింది అనే చెప్పాలి. అయితే ఆ తర్వాత భారీ హైప్ లేకుండా 2012 సమ్మర్ కి వచ్చిన ‘గబ్బర్ సింగ్’ మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. అభిమానుల ఆకలి తీర్చింది.
సరిగ్గా 14 ఏళ్ళ తర్వాత ఇలాంటి వాతావరణమే మళ్ళీ ‘ఓజి’ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలకు కనిపిస్తుంది. ఇప్పుడు కూడా ‘ఓజి’ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇందులో కూడా పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్ గా కనిపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ వీరాభిమాని సుజిత్ డైరెక్ట్ చేస్తున్న సినిమా ఇది. ఇంకా చెప్పాలంటే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కంటే ‘ఓజి’ పై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ సుజిత్ గత సినిమా ‘సాహో’ అంతగా ఆడలేదు. అదొక్క విషయం కొంతమందిని టెన్షన్ పెడుతుంది. మరోపక్క దర్శకుడు హరీష్ శంకర్ ను తక్కువ అంచనా వేయడానికి లేదు. అతనికి మాస్ ఆడియన్స్ పల్స్.. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానుల పల్స్ బాగా తెలుసు. సో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కూడా ‘గబ్బర్ సింగ్’ లా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.