దర్శకుడు పరశురామ్ మంచి రైటర్ అనే సంగతి అందరికీ తెలిసిందే. ‘సోలో’, ‘శ్రీరస్తు శుభమస్తు’, ‘గీత గోవిందం’ లాంటి సినిమాలు అతడిలోని కథకుడికి అద్దం పట్టాయి. అయితే ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే.. స్టార్ హీరోలను డీల్ చేయడంలో ఆయన కాస్త తడబడుతున్నాడనే విమర్శలు వస్తున్నాయి. రవితేజతో చేసిన ‘ఆంజనేయులు’, సారొచ్చారు’ సినిమాలు వర్కవుట్ కాలేదు. ఈ రెండు సినిమాల లైన్స్ బాగానే ఉన్నప్పటికీ అలాంటి కథల్లో రవితేజ లాంటి స్టార్ ని ఎలా సెట్ చేయాలనే విషయంలో దర్శకుడు ఇబ్బంది పడ్డారు.
ఇప్పుడు ‘సర్కారు వారి పాట’ విషయంలో కూడా అదే జరిగింది. ఈ సినిమా కోసం దర్శకుడు అనుకున్న పాయింట్ మంచిదే. సామాన్య ప్రజలు అప్పు తీసుకుంటే భయపడి ఏదోలా తిరిగి కట్టేస్తారు. కానీ కొందరు చాలా సులువుగా ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు. కోట్ల డబ్బుని బ్యాంక్ ల దగ్గర అప్పుగా తీసుకొని ఎగ్గొడుతున్నారు. ఇదే పాయింట్ ని కథగా రాసుకున్నారు దర్శకుడు. అయితే మహేష్ బాబు లాంటి స్టార్ హీరోతో ఈ పాయింట్ ను డీల్ చేయడంలో పరశురామ్ స్టామినా సరిపోలేదనే విమర్శలు వస్తున్నాయి.
ఫస్ట్ హాఫ్ లో కామెడీ, లవ్ ట్రాక్ తో ఎంటర్టైనింగ్ గా నడిపించిన పరశురామ్.. సెకండ్ హాఫ్ లో తడబడ్డారు. ఆయన అనుకున్న పాయింట్ కి సరైన సీన్లు రాసుకోలేకపోయారు. ఈ సినిమాతో పరశురామ్ మాస్ ఎలిమెంట్స్ ను డీల్ చేయడంలో యావరేజ్ మార్క్ ల దగ్గరే ఆగిపోయారు.
అయితే నాగచైతన్యతో చేస్తోన్న సినిమాకి మాత్రం మళ్లీ తన ఓల్డ్ స్టైల్ ని ఫాలో అవ్వబోతున్నారు. ‘గీత గోవిందం’ లాంటి క్లాసీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను తీయబోతున్నారు. చైతు కూడా ఇలాంటి కథ కోసమే చూస్తున్నారు. 14 రీల్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కనుంది.