చేతిలో అధికారం ఉన్నప్పుడు చేయలేని పనిని.. ఇంకొకరు అధికారంలోకి వచ్చి చేస్తుంటే కచ్చితంగా చూడాలి, చూసి అభినందించాలి. ఈ క్రమంలో ఇన్నాళ్లూ ఈ పని ఎందుకు చేయలేకపోయాం అనే మాటను బయటకు అనలేకపోయినా, కచ్చితంగా అనుకొని తీరాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, తెలుగు సినిమా వర్గాల్లో ఈ ఇదే విషయంలో చర్చ జరుగుతోంది. దీనికి కారణం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో రెయిజ్ చేసిన అంశాలు చాలా పాతవి కావడం. అవును కావాలంటే మీరు థియేటర్లకు వెళ్లిన రోజుల్ని గుర్తు చేసుకోండి. మీకే అర్థమవుతుంది.
‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) సినిమా వస్తోంది కాబట్టి పవన్ సినిమా థియేటర్ల గురించి, లీజుల గురించి, ధరల గురించి అడుగుతున్నారు. ఇన్నాళ్లూ అడగలేదు అని అంటున్నారు. ఎప్పుడూ అడగకుండా ఉండే బదులు.. ఎప్పుడో ఒకసారి అయినా అడగడం మంచిదే కదా. ఇక పవన్ రెయిజ్ చేసిన పాయింట్లు చూస్తే.. చాలా ఏళ్లుగా ‘సినిమా రంగానికి పరిశ్రమ హోదా’ అనే చర్చ ఎన్నో ఏళ్లుగా నడుస్తోంది. ఇప్పుడు ఆయన చేయిద్దాం అనుకుంటే పరిశ్రమ నుండి స్పందన లేదు.
థియేటర్ల టికెట్ రేట్లకు తగ్గట్టుగా సదుపాయాలు ఉంటున్నాయా అనే ప్రశ్న పవన్ (Pawan Kalyan) వేశారు. సింగిల్ థియేటర్లలో, కొన్ని చిన్న మల్టీప్లెక్సుల్లో కనీస సదుపాయాలు కూడా లేవు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇక సినిమా హాళ్లలో తినుబండారాలు, పానీయాల ధరలు అత్యధికంగా ఉండటం, మంచి నీళ్ల సదుపాయం కూడా సక్రమంగా లేకపోవడం లాంటివి ఎన్నో ఏళ్ల నుండి ఉన్నాయి. ఇక ఇన్‌స్టంట్ మల్టిప్లెక్స్‌ల సమస్య కూడా అంతే. పెద్ద థియేటర్‌ను రెండేసి స్క్రీన్లు చేసేసి మల్టీప్లెక్స్ ధరలు వసూలు చేస్తున్నారు. ఇక సౌకర్యాలు సింగిల్ థియేటర్‌లానే ఉంటాయి.
ఇప్పుడు చెప్పండి పైన చెప్పిన విషయాలన్నీ ఎన్నో ఏళ్లుగా మన ఊళ్లోని థియేటర్లలో కనిపిస్తుంటాయి. ఇన్నేళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు చాలానే వచ్చాయి. ఈ సమస్యలు చూశాయి. కానీ పరిష్కారం అవ్వలేదు. ఇక పరిశ్రమలోని పెద్దలు కూడా ఈ విషయాలను చూసీ చూడనట్టు వదిలేశారు. ఇప్పటికైనా పవన్ అడిగారు. ఇప్పటికైనా ఈ విషయం తేలితే చాలు. ఇక్కడ లేటయ్యాడా? టైమ్‌కి అడిగాడా? ఆయన చేతికి అవకాశం వచ్చాక.. సమయం చూసుకొని అడిగాడు అని చెప్పాలి.