సినిమా పరిశ్రమకు, సెంటిమెంట్‌కు చాలా దగ్గర సంబంధం ఉందని చాలా సార్లు చెప్పుకున్నాం. ఒక సినిమా మొదలవుతోంది అంటే దానికి ఎలాంటి సెంటిమెంట్‌లు ఉన్నాయి, ఎవరు నటిస్తున్నారు, వారికది ఎన్నో సినిమా, ఇద్దరికీ ఎన్నో సినిమా, టైటిల్ ఏ అక్షరంతో వస్తుంది… ఇలా చాలా సెంటిమెంట్లు పట్టించుకుంటారు మన సినిమా జనాలు. అది చూసి అభిమానులు కూడా అదే ఆలోచనలో ఉన్నారు. ఇప్పుడు ‘వకీల్‌సాబ్’… ‘వసూల్ సాబ్’లా వసూళ్లు సాధించడానికి కూడా ఇలా ఓ సెంటిమెంట్ ఉపయోగపడిందంటున్నారు నెటిజన్లు.
‘ఓ మై ఫ్రెండ్’తో దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన వేణు శ్రీరామ్‌కు ‘వకీల్‌సాబ్’ మూడో సినిమా అనే విషయం తెలిసిందే. ఆ మూడే ఇక్కడ సెంటిమెంట్ అట. గతంలో పవన్‌కు బిగ్గెస్ట్ హిట్లుగా నిలిచిన సినిమాలు ఆయా దర్శకులకు మూడో సినిమాలే అనేది ఇక్కడ లాజిక్ పాయింట్. కావాలంటే మీరూ చూడండి మీకే సులభంగా అర్థమైపోతుంది. పవన్ కెరీర్ బ్లాక్‌బస్టర్ ‘ఖుషి’.. ఎస్‌జే సూర్య కెరీర్‌లో మూడో సినిమా. ఆ సినిమా వసూళ్ల సునామి మీకు తెలిసిందే.
టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ కొట్టిన ‘గబ్బర్ సింగ్’ విషయంలోనూ ఇంతే. ‘షాక్’తో వచ్చిన హరీశ్ శంకర్‌కు ‘గబ్బర్…’ మూడో సినిమా. ఇక త్రివిక్రమ్ ‘జల్సా’ కూడా మూడో సినిమా. ఆ సినిమా పవన్ కెరీర్‌లో ఎంతటి విజయం అందించిందో తెలిసిందే. ఇప్పుడు వేణు శ్రీరామ్ మూడో సినిమాగా వచ్చిన ‘వకీల్‌సాబ్’ అదే రేంజిలో విజయం అందించి దూసుకుపోతుంది. సో పవన్‌కు దర్శకుల ‘3’ సెంటిమెంట్ బాగా వర్కవుట్ అవుతోంది. అన్నట్లు తర్వాత వస్తున్న ‘అయ్యప్పనుమ్ కొషియమ్’ రీమేక్ కూడా దర్శకుడు సాగర్ కె.చంద్రకు మూడో సినిమానే. మరి ఆ సినిమా ఏ రేంజి విజయాన్ని అందిస్తుందో?