జనసేన కార్యకర్తలకు దెబ్బ తగిలితే తనకి కన్నీళ్లు వస్తాయని జనసేన అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ చెప్పారు. కాకినాడలో ఏర్పాటు చేసిన సీమాంధ్ర ఆత్మగౌరవ సభకు వేలాదిగా అభిమానులు, జనసేన కార్యకర్తలు తరలి వచ్చారు. వేదికపై పవన్ రాగానే ఆయన్ను చూసేందుకు కొందరు కార్యకర్తలు చెట్లు, బారికేడ్లు ఎక్కారు. వారిని గమనించిన పవన్ “దయచేసి కిందకు దిగండి.. మీకు దెబ్బ తగిలితే నాకు కన్నీళ్లు వస్తుంది” అని చెప్పగానే కిందికి దిగారు.
సీమాంధ్ర ప్రజలు బాగుండాలని తాను సొంత అన్నయ్యను, వదినను.. మొత్తం ఫ్యామిలీని వదిలి భారతీయ జనతాపార్టీ, తెలుగు దేశం వారితో చేతులు కలిపినట్లు చెప్పారు. ఆంధ్రుల ఆత్మ గౌరవం దెబ్బతినేలా నాయకులు ప్రవర్తిస్తే తానేకాదు, ఏ జనసేన సైనికుడు ఊరుకోడని హెచ్చరించారు. ఇప్పటికైనా ఎంపీలు కళ్లు తెరిచి ఇక్కడి సమస్యల గురించి పార్లమెంట్ లో పోరాడాలని పిలునిచ్చారు. “ఉత్తరాది వాళ్లకు మనమంటే చులకన, అందుకే వారు మన కష్టాలను పట్టించుకోరు.. అటువంటి వారికి మనం కూడా భారతీయులమేనని చాటి చెప్పాలి” అని ఉద్వేగంతో పవన్ ప్రసంగించారు.