కిడ్నీ వ్యాధిగ్రస్థుల బాధలకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చలించి పోయారు. వారి గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం ప్రాంతంలో మంగళవారం జనసేన అధినేత పవన్ కల్యాణ్ కిడ్నీ వ్యాధిగ్రస్థులతో మాట్లాడారు. వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇచ్ఛాపురంలోని మణికంఠ థియేటర్లో ఆయన మాట్లాడారు. ” కొన్ని దశాబ్దాల నుంచి ఉద్దానంలోని ప్రజలు పెద్ద ఎత్తున చనిపోతున్నా ప్రభుత్వాలు దీనిపై ఎందుకు దృష్టి పెట్టలేదు?” అని ప్రశ్నించారు. “ఈ సమస్య గురించి మంత్రి కామినేని స్పందిస్తూ.. డయాలసిస్ సెంటర్లు ఏర్పాటుచేశామని చెబుతున్నారు. డయాలసిస్ అంటే చనిపోయే స్టేజిలో చేసేదే తప్ప బ్రతికించేది కాదు. మా పిన్నిగారి భర్త ఇలానే చనిపోయారు. ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలిసు.” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఉద్దానం సమస్యపై ఏపీ ప్రభుత్వం 48 గంటల్లో స్పందించాలని.. సమస్య పరిష్కార దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. “పుష్కరాలకు వందల కోట్లు .. రాజధానికి వేల కోట్లు ఖర్చు పెడతారు.. కానీ మనుషులు చనిపోతే మాత్రం నిధులు ఖర్చు పెట్టరా?” అని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ ఈ అంశంపై ప్రభుత్వం స్పందించకపోతే తానే ఉద్యమిస్తానని స్పష్టం చేశారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.