ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా నెల్లూరుకి చెందిన ఓ వ్యక్తిని తన ఆఫీస్ కి పిలిపించి సత్కరించారు. నెల్లూరులో నివసించే ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి మార్షల్ ఆర్ట్స్ లో ఎన్నో ప్రపంచ రికార్డులు సాధించి.. గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించాడు. అతడిని ప్రత్యేకంగా సత్కరించిన పవన్ కళ్యాణ్ తాను నెలకొల్పిన ‘పవన్ కళ్యాణ్ లెర్కింగ్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్’ ట్రస్ట్ ద్వారా ప్రభాకర్ రెడ్డికి రూ.లక్ష చెక్ అందజేశారు. వింగ్ చున్ అనే మార్షల్ ఆర్ట్స్ కి సంబంధించి మన దేశంలో ఉన్న శిక్షకుల గురించి గూగుల్ చేయగా.. ప్రభాకర్ రెడ్డి గురించి తెలిసిందని పవన్ కళ్యాణ్ చెప్పారు.
మార్షల్ ఆర్ట్స్ లో వివిధ దేశాల్లో శిక్షణ పొంది, రికార్డులు సాధించిన ఆయన పెద్ద పెద్ద నగరాలకు వెళ్లిపోకుండా.. తన ఊళ్లోనే ఉంటూ యువతకు శిక్షణ ఇవ్వడం సంతోషంగా ఉందని పవన్ అన్నారు. ఇలాంటి వారిని ప్రోత్సహించాలని.. ఈ క్రమంలోనే తన ట్రస్ట్ ద్వారా ఆర్ధిక తోడ్పాటు అందించానని చెప్పుకొచ్చారు. యువతకు దేహ దారుఢ్యంతో పాటు మానసిక బలం చేకూరడానికి యుద్ధ కళలు, సాహస క్రీడల్లో నాపుణ్యాలు దోహదం చేస్తాయని.. వాటిని నేర్చుకోవడం ఎంతైనా అవసరమని చెప్పారు.
చిన్నప్పటి నుండి బాలబాలికలకు ఈ విద్యలు నేర్పిస్తే ఆత్మ రక్షణ విద్య గాను.. మనోస్థైర్యం ఇచ్చే మార్గం గాను ఉపయోగపడతాయని అన్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో కొనసాగుతూనే.. మరోపక్క సినిమాలు కూడా చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన నటించిన ‘వకీల్ సాబ్’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఇదిలా ఉండగా.. పవన్.. క్రిష్ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’ సినిమాలో నటిస్తున్నారు. అలానే మలయాళం సినిమా ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ తెలుగు రీమేక్ లో నటిస్తున్నారు.