జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందింది. బుధవారం మధ్యాహ్నం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆర్ఎస్ఎస్ ప్రాంత సంపర్క ప్రముఖ్ ముళ్లపూడి జగన్, మరి కొందరు పవన్ కు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఆ తర్వాత పవన్ కు అయోధ్య రామ మందిరానికి సంబంధించిన నిర్మాణ విశేషాలను తెలియజేశారు. చిరంజీవి, ప్రభాస్ లకు ఇప్పటికే అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందగా తాజాగా ఈ జాబితాలో పవన్ చేరారు.
పరిమిత సంఖ్యలో అతిథులకు మాత్రమే ఆహ్వానం అందగా ఆహ్వానం అందిన టాలీవుడ్ సినీ ప్రముఖులు రామ మందిరం ప్రారంభోత్సవానికి హాజరయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ కు ఆహ్వానం అందడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో సంతోషిస్తున్నారు. రామ మందిర పునఃప్రతిష్ఠాపనకు ముహూర్తం సమీపిస్తుండగా ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.
ఎన్నో ప్రత్యేకతలతో ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. అయోధ్య రామ మందిర నిర్మాణం మొదలైన సమయంలో పవన్ కళ్యాణ్ 30 లక్షల రూపాయలు ట్రస్ట్ కు విరాళంగా ప్రకటించారు. మరోవైపు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నా పొలిటికల్ కార్యక్రమాల వల్ల పవన్ సినిమాల షూటింగ్ ఆలస్యమవుతోంది. ఈ ఏడాది సెకండాఫ్ లో పవన్ సినిమాల రిలీజ్ డేట్లకు సంబంధించి క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ సినిమాలన్నీ బాక్సాఫీస్ ను షేక్ చెసే రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్లు కావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సినిమాలు కలెక్షన్ల విషయంలో ఏ రేంజ్ లో రికార్డులను సొంతం చేసుకుంటాయో చూడాల్సి ఉంది.