పవన్ కల్యాణ్ సినిమాల మీద గత కొన్నేళ్లుగా చాలా పుకార్లు వస్తున్నాయి. ఆ సినిమా ఆగిపోయింది, ఈ సినిమా మొదలవ్వదు అంటూ రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై చిత్రబృందాల నుండి ఎలాంటి స్పందన రావడం లేదు. అయితే పవన్ కల్యాణ్ చేస్తున్న పనులు చూస్తుంటే పుకార్లు నిజమయ్యేలా కనిపిస్తోంది. తాజాగా వస్తున్న పుకారు ‘భవదీయుడు భగత్ సినిమా’ గురించే. ఈ సినిమా ఉంటుందా ఉండదా అంటూ చాలా రోజుల నుండి వార్తలొస్తున్నాయి. తాజాగా దీనిపై మరో పుకారు వచ్చింది.
పవన్ కల్యాణ్ చాలా రోజుల క్రితమే కొన్ని నిర్మాణ సంస్థలకు సినిమాలు చేస్తా అంటూ మాటిచ్చారు. అడ్వాన్స్‌లు కూడా తీసుకున్నారు అని అంటుంటారు. అయతే ఆయన రాజకీయ కార్యక్రమాల వల్ల సినిమాలు ఆగిపోతున్నాయి అని అంటున్నారు. ఈ క్రమంలో ఆయన సినిమాలు చేయాల్సిన రెండు నిర్మాణ సంస్థలకు ఒకేసారి సినిమా చేసేద్దాం అనుకుంటున్నారట. అంటే పవన్ సినిమాలు చేయాల్సిన నిర్మాణ సంస్థల జాబితాలో మైత్రీ మూవీ మేకర్స్, డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్ ఉన్నాయి.
మైత్రీ మూవీ మేకర్స్‌కి పవన్ ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమా చేయాలి. హరీశ్ శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాల్సి ఉంది. ఇక డీవీవీ దానయ్యకు మరో సినిమా చేయాల్సి ఉంది. తమిళ చిత్రం ‘తెరి’ని రీమేక్ చేయాలని అనుకున్నారు. అయితే ఇప్పుడు రెండు సినిమాలు కుదరవు కాబట్టి.. మైత్రీ, డీవీవీ కలిపి ఒకే సినిమాను నిర్మించేలా పవన్ కల్యాణ్ ప్లాన్స్ వేస్తున్నారట. నిజానికి ‘తెరి’ రీమేక్ కోసం సంతోష్ శ్రీనివాస్ – మైత్రీ టీమ్ కలసి కొన్ని రోజులు పని చేశారు. కానీ వర్కవుట్ కాలేదు.
మరోవైపు దానయ్య కూడా ఇదే సినిమా చేద్దాం అనుకున్నారట. దీంతో మైత్రీ, డీవీవీలను కలిపి ఒక సినిమా చేస్తే ఎలా ఉంటుంది అని పవన్ అనుకుంటున్నారని వార్తలొస్తున్నాయి. అదే జరిగితే ‘భవదీయుడు భగత్‌సింగ్’ సినిమా ఇక పక్కకు వెళ్లిపోయినట్లే. తర్వాతైనా ఈ సినిమా ఉంటుందా లేదా అనేది చూడాలి. ఇప్పటికైతే లేదు అనే అంటున్నారు.