ఒకటి, రెండు సినిమాలు హిట్ అయితే చాలు సినీ స్టార్ల జీవితాలు సెటిల్ అయిపోతాయి. అప్పుడప్పుడు సినిమాలు చేసినా జీవితానికి ఢోకా ఉండదు. కానీ 20 ఏళ్ల సినీ ప్రస్థానం, వరుసగా ఏడు హిట్లు సాధించిన రికార్డ్, ఒక సినిమాకు 20 కోట్లపైగా రెమ్యునరేషన్ అందుకుంటున్నా పవన్ కళ్యాణ్ ఇంకా సెటిల్ కాలేదు. తన బ్యాంక్ అకౌంట్ లో ఒక్క పైసా కూడా లేదు. ఆర్ధిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. దీనికి కారణం అతని నైజం. రేపటి గురించి ఆలోచించని తీరు. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునే గుణం.
ఇవన్నీ తన సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలోకి నెట్టేశాయి. ఇంకో ప్రధాన కారణం సినిమాలు తగ్గించేయడం. 2013 నుంచి ఇప్పటివరకు అయన కేవలం రెండు సినిమాలు మాత్రమే చేసారు. గోపాల గోపాల లో అతిథి పాత్రలో కనిపిస్తే, హీరోగా నటిస్తూ నిర్మించిన సర్ధార్ గబ్బర్ సింగ్ ఆశించినంతగా విజయం సాధించలేదు.పవన్ ఇతర స్టార్స్ కంటే చాలా సింపుల్ గా జీవిస్తున్నప్పటికీ తన వ్యక్తిగత సిబ్బందికి జీతాలు ఇవ్వాలి.
“పవన్ ఎక్కడకు వెళ్లినా అభిమానులను కంట్రోల్ చేయడానికి 12 మంది బౌన్సర్లు ఉంటారు. నగర శివార్లలోని ఫామ్ హౌస్, అక్కడి వ్యవసాయ క్షేత్రాన్ని చూసుకునేందుకు 25 మంది ఉన్నారు. విడిపోయిన భార్య రేణు దేశాయ్, పిల్లలకు ఖర్చులు ఇవ్వాలి. తనతో పాటు ఉన్న భార్య అన్నా లేజనోవా, కూతురు పోలేనా బాగోగులు చూసుకోవాలి. వీరందరి కోసం తప్పకుండా వేగంగా సినిమాలు చేయాలి.” అని పవన్ కి అత్యంత సన్నిహితులు చెప్పారు. “జనసేన పార్టీ పనులకు కూడా అధినేత సొంత డబ్బులనే ఖర్చు చేస్తున్నారు. మేము సాయం చేస్తామన్నా అంగీకరించడం లేదు.” అని జనసేన కార్యకర్త ఒకరు చెప్పారు. ఈ ఇబ్బందులను తొలగి పోవాలంటే పవర్ స్టార్ స్పీడ్ పెంచి ఏకకాలంలో రెండు, మూడు సినిమాలు చేయాలి.