పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటుడిగా సినిమాల్లో నటిస్తూనే, జనసేన పార్టీ అధినేతగా ప్రజల సమస్యలపై పోరాడుతున్నారు. ఓ వైపు కాటమరాయుడు షూటింగ్ లో బిజీగా ఉంటూనే, మరో వైపు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా కావాలని తొలి సారి తిరుపతిలో సభ పెట్టి కేంద్రాన్ని అడిగిన పవన్ కళ్యాణ్, తర్వాత కాకినాడ బహిరంగ సభలో బీజేపీ, టీడీపీ నాయకులను సూటిగా ప్రశ్నించారు. ప్రత్యేక హోదా తీసుకురావడం చేతకాదని చెప్పండి, జనసేన రంగంలోకి దిగుతుందని హెచ్చరించారు.
మరోసారి సీమాంధ్ర ప్రజల గొంతు ఢిల్లీకి వినిపించడానికి జనసేన నేత సిద్ధమవుతున్నారు. అనంతపురం వేదికగా మూడో బహిరంగ సభను నిర్వహించడానికి ముహూర్తం ఫిక్స్ చేశారు. నవంబర్ 10న భారీ సభ జరిపేందుకు డిసైడ్ అయ్యారు. ఈ మీటింగ్ లో సీమాంధ్రలోని కరువు ప్రాంతాల గురించి కేంద్రానికి పవన్ కళ్యాణ్ వివరించనున్నట్లు తెలిసింది. ఈ ప్రాంత ప్రజలకు ప్రత్యేక హోదా ఎంత అవసరమో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కళ్లకు కట్టే ప్రయత్నం జన సేన నేత చేయనున్నట్లు సమాచారం.