పవర్ కోసం కాదు.. ప్రశ్నించటానికి అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 2014, మార్చి 14న జన సేన పార్టీని స్థాపించారు. అయినా అప్పటి ఎన్నికల్లో ప్రత్యక్షంగా పోటీ చేయలేదు. అంతే కాదు పార్టీ సిద్ధాంతాలు కానీ, నాయకులూ ఎవరు అనే విషయంలో క్లారిటీ లేదు. పార్టీ ఏర్పడి రెండేళ్లకు తిరుపతి, కాకినాడలలో జనసేన తరుపున బహిరంగ భారీ సభలను నిర్వహించారు. సీమాంధ్రకు ప్రత్యేక హోదా కోసం పోరాటానికి జన సేన అధ్యక్షుడు నడుం బిగించారు. ప్రజల సమక్షంలో పాలకులను ప్రశ్నించారు.
పార్టీ విస్తరణపై దృష్టి పెట్టిన పవన్ కళ్యాణ్ జన సేన సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ‘నేను-మనం-జనం’ (‘మార్పుకోసం యుద్ధం’) అనే పుస్తకం రాస్తున్నారు. నిన్నటి నుంచి మొదలెట్టిన ఈ పుస్తకంలో పార్టీ గురించే కాకుండా, తన మనసులోని భావాలను, ఆలోచనలను జనసేన అధినేత పంచుకోనున్నారు. తాను చెయ్యాలనుకున్న కార్యక్రమాలు, సంధించాలనుకుంటున్న ఆశయాలను ఇందులో పొందు పరచనున్నారు. ఈ పుస్తకం వచ్చే ఏడాది రిలీజ్ కానుంది.