సినిమాలు – రాజకీయాలను విడదీసి చూడలేం. ఈ బంధం మన దగ్గర కంటే తమిళనాట ఎక్కువగా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. సినిమాల నుండి రాజకీయాల్లోకి వచ్చి… రెండింటినీ కంటిన్యూ చేసేవాళ్లు, చేసినవాళ్లు ఉన్నారు. అయితే ఇంకొందరు ఉన్నారు. సినిమాల్లో తమ రాజకీయ ఆలోచనల్ని చూపించేవాళ్లు. ఇలా రాజకీయ ఆలోచనలు చూపించడం… ఏకంగా ఆ సినిమా ఫలితం మీద ప్రభావం చూపిస్తోంది. ఇటీవల కాలంలో ఇలాంటి సినిమాలు కొన్ని వచ్చి, ఇబ్బంది పడ్డాయి కూడా.
‘బీస్ట్’ సినిమా ట్రైలర్‌లో రాజకీయాల గురించి విజయ్ నోట ఓ డైలాగ్ చెప్పించారు. నేను మీలా రాజకీయ నాయకుణ్ని కాదు… సోల్జర్‌ని అనే కాన్సెప్ట్‌లో ఆ డైలాగ్ ఉంటుంది. ఏదో ఒక డైలాగ్ కోసం అలా అన్నారేమో అనుకున్నారంతా. అయితే సినిమాలో చాలా సీన్లు రాజకీయ కోణంలోనే సాగుతాయి. దీంతో సినిమా కథను, ఫలితాన్ని ఆ పాలిటిక్స్ ఇబ్బంది పెట్టాయి అని అంటున్నారు ప్రేక్షకులు. సినిమా తొలి షో చూసినవాళ్లు చాలామంది ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం గమనార్హం.
నిజానికి విజయ్ ఇంతకుముందు చేసిన సినిమాల్లో ‘సర్కార్’ కూడా ఇలా రాజకీయ ఇన్‌టెన్సన్ మధ్యలో నలిగిపోయింది అని చెప్పొచ్చు. సినిమాలో మంచి పాయింట్ మీదే డిస్కషన్ జరిగినా, కొన్ని చోట్ల వ్యక్తిగతంగా సంభాషణలు కనిపించేసరికి… రాజకీయ రంగు బాగా పులిమేశారు. విజయ్ కావాలని చేస్తున్నాడో లేక అనుకోకుండా జరుగుతున్నాయా అనే విషయం పక్కనపెడితే సినిమా ఫలితాన్ని మాత్రం తెగ ఇబ్బంది పెడుతున్నాయి అని చెప్పొచ్చు. ఇదే సమస్య ఎదుర్కొన్న మరో కథానాయకుడు సూపర్ స్టార్ రజనీకాంత్. తలైవా రాజకీయాల్లో వస్తాడు అనుకుంటున్న రోజుల్లో కొన్ని సినిమాలు చేశారు.
బడుగు బలహీన వర్గాల వారి కోసం ఆ సినిమాలు చేసినట్లు బయటకు కనిపించినా… తన రాజకీయ సిద్ధాంతాల్ని ఆ సినిమాల్లో చూపించారు అని చెప్పొచ్చు. దీంతో రజనీ రాజకీయ సినిమాలు అంటూ పేరు వచ్చేసింది. అవే ‘కాలా’, ‘కబాలి’. ఈ సినిమాల విషయంలోనూ రాజకీయం చాలా ఇబ్బంది పెట్టింది అని చెప్పొచ్చు. కమల్ హాసన్ అయితే ఎప్పటి నుండో ఈ విషయం ఇబ్బంది పడుతూనే ఉన్నారు.