ఓ రెండెకరాల భూమి కోసం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం కాళ్ళు పట్టుకునే స్థితిలో చిరంజీవి, నాగార్జున ఉన్నారా? అని ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళి ప్రశ్నించారు. ప్రతి విషయంలోనూ చాలా ముక్కుసూటిగా వ్యవహరిస్తారని ఆయనకు పేరుంది. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటం పోసాని వ్యక్తిత్వం. ఏపీలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఆయన మద్దతుగా మాట్లాడుతూ ఉంటారు. అయితే, తనకు రాజకీయాల మీద ఆసక్తి లేదన్నారు. జగన్మోహన్ రెడ్డి పదవులు ఆఫర్ చేసినా తీసుకోలేదన్నారు.
తెలంగాణ ప్రభుత్వంతో తెలుగు సినిమా పెద్దలు చర్చలు జరిపారు. చిరంజీవి స్వగృహంలో జరిగిన ఆ చర్చలకు బాలకృష్ణకు ఆహ్వానం అందలేదు. దానిపై ఆయన సీరియస్ అయ్యారు. “భూములు పంచుకుంటున్నారా? అందరూ కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారా?” అని కామెంట్లు చేశారు. దీనిపై అప్పట్లో మెగా బ్రదర్ నాగబుబు ఫైర్ అయ్యారు. ఆయనకు ప్రసన్నకుమార్ వంటి కొందరు కౌంటర్ ఇచ్చారు. రెండు మూడు రోజులు మీడియాలో వాడివేడి చర్చ జరిగిన తరవాత వివాదం సద్దుమణిగింది. ఇప్పుడు పోసాని రియాక్షన్‌తో మరోసారి బయటపడింది.
బాలకృష్ణ విమర్శలను పోసాని పరోక్షంగా ఖండించారు. అలాగే, తెలంగాణ ప్రభుత్వంతో చర్చలకు వెళ్ళిన వాళ్ళు కోటీశ్వరులనీ, వాళ్ళకు భూములు అవసరమా? అని అంటున్నారు. తాను రియల్ ఎస్టేట్ కామెంట్లు మీద స్పందించకపోవడం మంచిది అంటూనే స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం దగ్గరకు వెళ్ళిన వాళ్ళందరూ పేరు-ప్రఖ్యాతలు, కీర్తి-సంపదలు ఉన్నవాళ్ళేనని ఆయన అన్నారు. రెండెకరాల భూమి కోసం ప్రభుత్వం కాళ్ళు పట్టుకునే స్థితిలో లేరన్నట్టు మాట్లాడారు. అలాగే, ప్రస్తుత సినీ తారలకు రాజకీయాలలో స్కోప్ లేదన్నారు.