కొత్త తరహా కథలు ఎంచుకుని, ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరోల్లో ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) టాప్ లిస్టులో ఉన్నాడు. మొదట లవ్ టుడేతో (Love Today) సంచలన విజయం సాధించిన అతను, ఇప్పుడు డ్రాగన్ తో (Return of the Dragon) కోలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు. తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకుల్ని కూడా ఆకట్టుకున్నాడు. అయితే వరుసగా హిట్లు అందుకున్న ప్రదీప్, ఇప్పుడు మరిన్ని ఎక్స్‌పెక్టేషన్స్ పెంచుకున్నట్లయ్యింది. ప్రస్తుతం ప్రదీప్ రెండు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నాడు. మొదటిగా లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనే సినిమా, ఇది 70% వరకు షూటింగ్ పూర్తి చేసుకుంది.
నయనతార (Nayanthara) భర్త విఘ్నేశ్ శివన్ (Vignesh Shivan) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా, రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఉండనుంది. విఘ్నేశ్ గత కొన్ని సినిమాలతో ఫ్లాప్ లిస్టులో ఉన్నప్పటికీ, ఈ మూవీతో సక్సెస్ కొట్టాలని కసిగా ఉన్నాడు. ఇదే సమయంలో ప్రదీప్ కూడా కంటెంట్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇక మరోవైపు, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ప్రదీప్ కొత్త సినిమా రూపొందనుంది. ఈ సినిమాకు సుధ కొంగర (Sudha kongara Prasad) శిష్యుడు కీర్తీశ్వరన్ దర్శకత్వం వహించనున్నాడు.
అతనికి ఇదే డెబ్యూ మూవీ కావడంతో, ప్రదీప్ కూడా చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. తమిళ హీరోగా తన మార్కెట్‌ను తెలుగు ప్రేక్షకుల్లో కూడా పెంచుకోవాలని చూస్తున్నాడు. ఇక ఈ రెండు సినిమాల కంటెంట్ పూర్తిగా హైలెట్ అయ్యేలా ప్రమోషన్ విషయంలో కొత్తగా ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. ఇప్పటివరకు ప్రేమ కథల్లో తనదైన ముద్ర వేసిన ప్రదీప్, ఇప్పుడు విభిన్నమైన పాత్రలతో ప్రయోగాలు చేయాలనుకుంటున్నాడు.
లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్ అయితే, కీర్తీశ్వరన్ మూవీ మాత్రం కొత్త కాన్సెప్ట్‌తో రాబోతుందని సమాచారం. ప్రదీప్ వరుసగా రెండు హిట్లు కొట్టినప్పటికీ, ఇప్పుడు వచ్చే రెండు సినిమాలు అదే రేంజ్‌లో ఉండాలంటే, కథలు మరింత స్ట్రాంగ్‌గా ఉండాల్సిందే. ఇప్పటికే తమిళంలో తనను టైర్-2 హీరోగా నిలబెట్టుకున్న ప్రదీప్, తెలుగులోనూ అదే స్థాయికి ఎదగాలనే లక్ష్యంతో ఉన్నాడు. ఈ రెండు సినిమాలు బ్లాక్‌బస్టర్ అయితే, అతను కోలీవుడ్‌లో మరో లెవల్‌కి వెళ్లిపోవడం ఖాయం!