ప్రియాంక జవాల్కర్ (Priyanka Jawalkar) అందరికీ సుపరిచితమే. ‘టాక్సీ వాలా'(Taxiwaala) ‘ఎస్.ఆర్.కల్యాణమండపం’ (SR Kalyanamandapam) వంటి హిట్ సినిమాల్లో నటించి హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే ‘టిల్లు స్క్వేర్’ ‘మ్యాడ్ స్క్వేర్’ (Mad Square)వంటి హిట్ సినిమాల్లో కేమియోలు చేసింది. కొన్నాళ్లుగా సెలక్టివ్ గా సినిమాలు చేస్తూ వస్తుంది ప్రియాంక జవాల్కర్. ఇదిలా ఉండగా.. ఇటీవల ఆమె ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె అందుకున్న మొదటి పారితోషికం గురించి తెలిపి పెద్ద షాక్ ఇచ్చింది.
ప్రియాంక జవాల్కర్ మాట్లాడుతూ… ” ‘కల వరం ఆయే’ సినిమా ఎక్స్పీరియన్స్ కోసం చేశాను. కాకపోతే ఆ టైంలో ఆ సినిమా నిర్మాతల దగ్గర బడ్జెట్లు లేవు. కాబట్టి..నాకు రూ.10,000 పారితోషికం ఆఫర్ చేశారు. వాళ్ళ పరిస్థితి చూసి ఎందుకులే…అనుకుని వద్దులెండి అని అన్నాను. పారితోషికం లేకుండా ఆ సినిమా చేయాలని డిసైడ్ అయ్యాను. ఈ విషయం నా ఫ్రెండ్ కి చెప్తే.. ‘అలా చేయడం కరెక్ట్ కాదు. నువ్వు పని చేస్తున్నప్పుడు..
దానికి ఎంతో కొంత అమౌంట్ తీసుకోవాలి’ అని చెప్పాడు. దీంతో నేను నిర్మాతల్ని సరే ‘ఆ పది వేలు ఇస్తాను అన్నారు కదా.. ఇస్తారా?’ అని అడిగాను. అందుకు వాళ్ళు షాక్ అయ్యారు. నేను ‘పారితోషికం వద్దు అన్నాను’ అని వాళ్ళు వేరే వాటికోసం సగం వరకు ఖర్చు పెట్టేశారట. దీంతో రూ.6000 మిగిలాయట. అడిగాను కదా అని నాకు ఆ రూ.6000 ఇచ్చారు. సో నా మొదటి సినిమాకి నేను అందుకున్న పారితోషికం రూ.6000″ అంటూ అసలు విషయం చెప్పుకొచ్చింది.