నవదీప్ (Navdeep Pallapolu), దీక్షిత్ శెట్టి (Dheekshith Shetty) ప్రధాన పాత్రల్లో రమణ తేజ (Ramana Teja) దర్శకత్వంలో తెరకెక్కిన వెబ్ సిరీస్ “టచ్ మీ నాట్” (Touch Me Not). హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ సిరీస్ కాన్సెప్ట్ కాస్త ఆసక్తికరంగానే ఉంది. మరి సిరీస్ ప్రేక్షకుల్ని ఏమేరకు అలరించగలిగిందో చూద్దాం..!!
కథ: చిన్నతనంలో జరిగిన ఓ యాక్సిడెంట్ కారణంగా రిషి (దీక్షిత శెట్టి)కి ఒక స్పెషల్ పవర్ వస్తుంది. అదేంటంటే.. ఏదైనా వస్తువును లేదా మనిషిని ముట్టుకుంటే.. వాళ్లు ఏం చూశారు, ఆ వస్తువు చరిత్ర ఏమిటి అనేది తెలిసిపోతుంది. ఎస్పీ రాఘవ్ (నవదీప్) & దేవిక (సంచిత పూనాచా) రిషి టాలెంట్ ను సరైన విధంగా వినియోగించుకోవాలనుకుంటారు. హాస్పిటల్లో చోటు చేసుకున్న ఓ ఫైర్ యాక్సిడెంట్ ను డీల్ చేయడంలో రిషి స్పెషల్ టాలెంట్ పనికొస్తుంది అనుకుంటారు రాఘవ్ & దేవి.
ఆ కేస్ ను రిషి డీల్ చేయగలిగాడా? రాఘవ్ ఎందుకని ఆ కేస్ విషయంలో అంత సీరియస్ గా ఉన్నాడు? దేవికకి ఆ కేస్ తో ఉన్న సంబంధం ఏమిటి? ఇంతకీ హాస్పిటల్లో అంతమందిని చంపింది ఎవరు? వంటి ప్రశ్నలకు సమాధానమే “టచ్ మీ నాట్” (Touch Me Not) వెబ్ సిరీస్.
నటీనటుల పనితీరు: దీక్షిత్ శెట్టి ని కాలేజ్ స్టూడెంట్ గా చూపించాలనుకున్న తపనలో అతడికి వేసిన మేకప్ సెట్ అవ్వలేదు. నటుడిగా అయితే దీక్షిత పాత్రను పండించడానికి మంచి ప్రయత్నమే చేశాడు కానీ.. ఎందుకో సరిగా వర్కవుట్ అవ్వలేదు. నవదీప్ పోలీస్ ఆఫీసర్ గా అలరించాడు. అతడి పాత్రకి మంచి షేడ్స్ ఉన్నాయి, అయితే.. అవన్నీ సెకండ్ సీజన్ కి దాచిపెట్టి, ఈ మొదటి సీజన్ మొత్తాన్ని అతడి క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం సరిపెట్టడం అనేది బాలేదు. ఆ పాత్ర తాలూకు ట్విస్ట్ ను మరీ ఎక్కువగా సాగదీయడం వల్ల ప్రేక్షకుల్లో ఆసక్తి లోపించి, సెకండ్ సీజన్ కోసం వెయిట్ చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా రాదు.
సంచిత పూనాచా (Sanchitha Poonacha) యాక్టివ్ గా కనిపించింది. ఆమె పాత్రకు పెద్దగా వెయిటేజ్ లేకపోయినా, కథ యొక్క గమనానికి తోడ్పడింది. కోమలీ ప్రసాద్ కి (komalee prasad) మంచి పాత్ర దొరికింది. అయితే.. ఆమెను కూడా కాలేజ్ పిల్లలా చూపించేందుకు పడిన శ్రమ వృథా అయ్యింది. కానీ మేఘన పాత్రలో ఉన్న ఇంటెన్సిటీని ఆమె క్యారీ చేసిన విధానం బాగుంది. ప్రమోదిని (Pramodini), బబ్లూ పృథ్వీరాజ్ (Prithviraj), అనీష్ కురువిల్ల పాత్రలు ఇంకా పూర్తిస్థాయిలో ఎక్స్ ప్లోర్ చేయలేదు. బహుశా.. వాటి కోసం సెకండ్ సీజన్ వచ్చేవరకు వెయిట్ చేయాలేమో.
సాంకేతికవర్గం పనితీరు: అన్వర్ అలీ (Anwar Ali) ఎడిటింగ్ స్టైల్ బాగుంది. ముఖ్యంగా ఇంటర్ కట్స్ & ట్రాన్సిషన్స్ బాగా ఇచ్చాడు. గోకుల్ భారతి (Gokul Bharathi) సినిమాటోగ్రఫీ వర్క్ డీసెంట్ గా ఉంది. లారీ ఛేజింగ్ సీన్ & కొన్ని నైట్ షాట్స్ కి మంచి లైటింగ్ తో మంచి అవుట్ పుట్ ఇచ్చాడు. టెక్నికల్ గా డి.ఐ & మిక్సింగ్ విషయంలో మంచి కేర్ తీసుకున్నారు.
దర్శకుడు రమణ తేజ ఇదివరకు “అశ్వద్ధామ (Aswathama), కిన్నెరసాని” సినిమాలను తెరకెక్కించిన అనుభవం ఉన్నప్పటికీ.. ఒక వెబ్ సిరీస్ లోని మొదటి 6 ఎపిసోడ్లను కేవలం క్యారెక్టర్ ఇంట్రడక్షన్ & ఎస్టాబ్లిష్మెంట్ కి సరిపెట్టడం అనేది పెద్ద మైనస్ గా నిలిచింది. ఎంత సిరీస్ ను సాగదీయాలనుకున్నా.. అవి సందర్భాలతో, కుదిరితే ఇంకొన్ని కేసులతో సాగదీయాలి కానీ.. ఒకే కేసును ఇలా 6 ఎపిసోడ్లు సాగదీయడం అనేది ఆడియన్స్ ను ఏమాత్రం అలరించలేకపోయింది. ఆ కారణంగా దర్శకుడు రమణ తేజ కథకుడిగా, డైరెక్టర్ గా ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి.
విశ్లేషణ: ఆసక్తికరమైన ఒక కోర్ పాయింట్ ను, అంతే ఆసక్తికరమైన కథనంతో నడిపించినప్పుడే ఆ సినిమా/సిరీస్ (Touch Me Not) ఆకట్టుకుంటాయి. కోర్ పాయింట్ డిఫరెంట్ గా ఉంది కదా అని సాగదీసుకుంటూ వెళ్తే ఆడియన్స్ ను కూర్చోబెట్టడం అనేది కష్టం. ఈ విషయాన్ని రమణతేజ మిస్ అయ్యాడు. అందువల్ల “టచ్ మీ నాట్” వెబ్ సిరీస్ ఆడియన్స్ ను ఆకట్టుకోలేక చతికిలపడింది!
ఫోకస్ పాయింట్: కాన్సెప్ట్ తోపాటు డీలింగ్ కూడా కొత్తగా ఉంటే బాగుండేది!
రేటింగ్: 1.5/5