సన్నగా ఉండే అమ్మాయిలు లావుగా మారితే ఏమన్నా పాపమా… కాస్త లావైతే చాలు నానా మాటలు పడాల్సి వస్తుంటుంది. సినిమా హీరోయిన్ల నుండి సాధారణ అమ్మాయిల వరకూ అందరూ ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నవారే. తాజాగా ఇలాంటి మాటలు పడుతున్న భామ ప్రియాంక జవాల్కర్. వరుస సినిమా సినిమాలతో బిజీగా ఉన్న ఈ భామ ‘బాడీ షేమింగ్’ ఇబ్బందులు ఎదుర్కొంది. దాంతో ఆమె ఒకింత అసహనానికి కూడా గురైంది. ఆ ఆవేదనను ఆమె వెలిబుచ్చుతూనే ఉంది. తాజాగా తన శరీరం షేప్ ఔట్ అవ్వడానికి కారణాల్ని కూడా చెప్పుకొచ్చింది.
హీరోయిన్లు చాలామంది అప్పుడే బొద్దుగా మారుతారు, కొన్ని రోజులకే స్లిమ్ అయపోతారు. అయితే ఇదేమంత సులభం కాదనే విషయం గుర్తుంచుకోవాలి. అలాగే సరదాకి చేసే పని కాదని కూడా తెలుసుకోవాలి. తాజాగా ప్రియాంక జవాల్కర్ కూడా ఇలానే లావై, మళ్లీ నాజూకుగా మారుతోంది. కారణమేంటి అని ఎవరూ అడక్కుండా… షేప్ ఔట్ అయిపోయింది అంటూ మాటలు అనడం మొదలుపెట్టారు. సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే తాను అలా మారానని అనడం సరికాదు అని చెబుతోంది.
లాక్‌డౌన్ సమయంలో తన శరీరంలో చాలా మార్పులు వచ్చాయని, ఎందుకా అని ఆలోచించి… వైద్యుల్ని సంప్రదిస్తే థైరాయిడ్ ఉందని తేల్చారని, ఆ కారణంగానే బరువు పెరిగానని ప్రియాంక చెప్పుకొచ్చింది. ఆ తర్వాత వైద్యం తీసుకుంటూనే, జిమ్‌లో వర్కౌట్లు చేసి… ఫుడ్ విషయంలో జాగ్రత్తలు తీసుకొని తగ్గానని చెప్పుకొచ్చారు. నిజ జీవితంలో ఉన్నదాని కంటే కెమెరాలో 30 శాతం లావుగా కనిపిస్తామని, అందుకే ఇంకాస్త తగ్గాల్సి వస్తోందని ప్రియాంక చెప్పుకొచ్చింది.