‘మా సినిమా ఫస్ట్ డే షేర్ 60 కోట్లు, మా సినిమా ఆ స్టార్ హీరో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్, తెలుగు చలనచిత్ర చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రమిది’ అంటూ భారీ కొటేషన్స్ తో ఈమధ్య సినిమా విడుదలైన కొద్ది గంటల్లోనో లేక విడుదలైన మరుసటిరోజో ఇంటర్నెట్ లో ప్రత్యక్షమవుతున్న పోస్టర్లు చూస్తుంటే జనాలు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఒక్క రోజులో నిజంగా 60 కోట్ల షేర్ సాధించవచ్చా?, నిజంగానే ఈ సినిమా ఇండస్ట్రీ హిట్టా? అని కన్ఫ్యూజన్ లో కొట్టుమిట్టాడుతున్నారు. ఓవర్సీస్ సినిమా మార్కెట్ ఎనలైజింగ్ “రెంట్రాక్” తరహాలో తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాక ఇండియా ఆ సిస్టమ్ లేకపోవడంతో.. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు “మా సినిమా కలెక్షన్ ఇంత, ఇది మా రికార్డ్” అని ప్రకటించేసుకొంటున్నారు. ఈ విషయంలో క్లారిటీ లేకపోవడం వల్ల ఇరువర్గాల అభిమానుల నడుమ కూడా గొడవలు జరుగుతున్నాయి. “మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప” అంటూ అభిమానులు ఆన్ లైన్ లో ట్విట్టర్, ఫేస్ బుక్ లలో కొట్టుకుఛస్తున్నారు.
ఈ విషయంలో కొన్ని అనఫీషియల్ వెబ్ సైట్స్ అనవసర చొరవ చూపిస్తూ పత్తా లేని లెక్కలు చూపిస్తున్నాయి. అంతెందుకు హరీష్ శంకర్ రొమ్ము విరిచి మరీ “నా సినిమా సూపర్ హిట్, కొందరికి నచ్చనంత మాత్రాన బ్లాక్ బస్టర్ హిట్ అవ్వకుండా ఉండదు” అంటూ గొంతు చించుకొని అరిచినప్పటికీ.. ఆ సినిమా వల్ల కొన్ని ఏరియాల్లో లాస్ వచ్చిందని స్వయంగా నిర్మాత దిల్ రాజు “ఫిదా” తర్వాత ఒప్పుకోవడంతో అప్పటివరకూ “డీజే” టీం చెప్పిందంతా అబద్ధమే అని జనాలకి అర్ధమైపోయింది. ఓవర్సీస్ లో “రెంట్రాక్” వలె ఇండియాలో కలెక్షన్స్ కౌంట్ కోసం ఒక సంస్థను, ఒక విధానాన్ని ఏర్పరుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే ఈ లెక్కల్లో మార్పు వస్తుంది. పారదర్శకత ఏర్పడి ఈ అభిమానుల గొడవలు తగ్గడమే కాక భవిష్యత్ నిర్మాతలకు ఒక క్లారిటీ ఉంటుంది. మరి ఇప్పటికైనా ఫిలిమ్ ఛాంబర్ లేదా మా అసోసియేషన్ బాధ్యత తీసుకొని ఈ కలెక్షన్స్ విషయంలో క్లారిటీ మెయింటైన్ చేస్తే బెటర్ లేదంటే కష్టమే.