చిరంజీవి హీరోగా నటించిన భోళాశంకర్ మూవీ డిజాస్టర్ టాక్‌ను తెచ్చుకున్నది. ఫస్ట్ వీక్ ముగియకముందే చాలా థియేటర్లలో నుంచి ఈ సినిమాను ఎత్తేశారు. తమిళంలో విజయవంతమైన వేదాళం సినిమా ఆధారంగా డైరెక్టర్ మెహర్ రమేష్ భోళా శంకర్ సినిమాను తెరకెక్కించాడు. కథ, కథనాల్లో కొత్తదనం లేకపోవడం, మెయిన్ పాయింట్ కంటే యాక్షన్ సీన్స్, ఎలివేషన్స్‌కు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడమే ఈ సినిమా పరాజయానికి కారణమంటూ విమర్శలు వినిపిస్తోన్నాయి. సినిమాలోని చాలా సీన్స్‌లో జబర్ధస్త్ గ్యాంగ్ చిరంజీవిని పొగుడుతూ కనిపించడంపై సోషల్ మీడియాలో ట్రోల్స్, మీమ్స్ వస్తోన్నాయి.
ఈ భజనకారులను దూరం పెడితేనే చిరంజీవికి హిట్స్ వస్తాయంటూ రామ్‌గోపాల్‌వర్మతో పాటు పలువురు సినీ సినీ ప్రముఖులు కామెంట్స్ చేశారు. ఈ విమర్శలపై కమెడియన్ 30 ఇయర్స్ పృథ్వీ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. మెగా ఫ్యామిలీ భజనలను ఎంకరేజ్ చేయదని అన్నాడు. సిన్సియర్‌గా కష్టపడి పనిచేసే వాళ్లను చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఎంకరేజ్ చేస్తారని, భజనకారులను కాదని పృథ్వీ అన్నాడు.
ప్రస్తుతం ఒకటి, రెండు హిట్లతోనే హీరోల మనస్తత్వాల్లో మార్పులు వస్తున్నాయి. కానీ చిరంజీవి 150కిపైగా సినిమాలు చేసినా ఆయన వ్యక్తిత్వంలో కొంచెం కూడా మార్పు రాలేదని పృథ్వీ తెలిపాడు. ప్రస్తుతం ఉన్న హీరోలు బిల్డప్‌లు తగ్గించుకొని సినిమాలు చేస్తే మంచిదంటూ పేర్కొన్నాడు. అందరూ ఎన్టీఆర్, రామ్‌చరణ్ మాదిరిగా ఫీలైతే కుదరదని, వారి స్థాయికి చేరుకోవడానికి ఎంతో హార్డ్ వర్క్ పృథ్వీరాజ్ అన్నాడు. చిరంజీవి భోళాశంకర్‌తో పాటు పవన్ కళ్యాణ్ బ్రో సినిమాలో (Prudhvi Raj) పృథ్వీరాజ్ కమెడియన్‌గా కనిపించారు.