గ్రామాల దత్తత తీసుకోవడమంటే చెక్కులపై సంతకం చేయడం కాదని కమర్షియల్ డైరక్టర్ పూరి జగన్నాథ్ చెప్పారు. ఈ మధ్య సినీ నటీనటులు పేద గ్రామాలను దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కూడా మహబూబ్ నగర్ జిల్లాలోని కొండా రెడ్డి పల్లెని గత ఏడాది దత్తత తీసుకున్నారు. ఆ గ్రామ బాగోగులను దగ్గరుండి చూసుకుంటున్నారు.
ప్రకాష్ రాజ్ చేస్తున్న సామజిక సేవ గురించి “మన ఊరి రామాయణం” ఆడియో వేడుకలో డైరక్టర్ పూరి జగన్నాథ్ మాట్లాడుతూ “ప్రకాష్ చెక్కులు ఇచ్చి కూర్చోడు. రైతులతో మాట్లాడుతాడు. వారి సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారం దిశగా అడుగులు వేస్తాడు. అవసరమైతే కలెక్టర్ తో కలుస్తాడు. అదే విధంగా స్కూల్లో మాస్టర్ తో, పిల్లలతో గడుపుతాడు. వారికి కావలసినవి తానే స్వయంగా తెచ్చి ఇస్తాడు. సినిమాల్లో నటిస్తూ, నిర్మిస్తూ బిజీగా ఉన్నా… ఈ పనులన్నీ ఓపిగ్గా చేస్తాడు. అందుకే హ్యాట్సాఫ్ ప్రకాష్” అని చెప్పారు. అంతేకాదు ప్రకాష్ ఎక్కడుంటే అక్కడ పచ్చగా ఉంటుందని అభినందించారు.